శ్రీ శివ మహా పురాణము - 381


🌹 . శ్రీ శివ మహా పురాణము - 381 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 14

🌻. వజ్రాంగుడు - 1 🌻


నారుదుడిట్లు పలికెను-

హే విష్ణు శిష్యా! నీవు శివ భక్తులలో శ్రేష్ఠుడవు హే విధీ! నీవు ఈ శివాశివుల పరమచరితమును చక్కగా వివరించితివి. (1) హే. బ్రహ్మన్‌! దేవతలను తీవ్రముగా పీడించిన తారకాసురుడెవ్వరు? అతడెవని కుమారుడు? శివునిచుట్టూ తిరిగే ఆ గాథము చెప్పుము (2) ఆ జితేంద్రియుడగు శంకరుడు మన్మథుని భస్మము చేసిన విధమెట్టిది పరమేశ్వరుని ఆ అద్భుతగాథను గూడ మిక్కిలి ప్రీతితో చెప్పుము. (3) జగత్స్వరూపిణి, ఆదిశక్తి యగు శివాదేవి శంభుని భర్తగా పొంది ఆ నందించుట కొరకై మిక్కిలి తీవ్రముగు తపస్సును చేసిన విధం బెయ్యది? (4) హే మహాప్రాజ్ఞా! శివభక్తుడను, నీ పుత్రుడను, శ్రద్ధ గలవాడను అగు నాకు ఈ గాథనంతనూ వివరించి చెప్పుము(5).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ దేవర్షీ! నీవు నా కుమారులలో శ్రేష్ఠుడవు. మహాజ్ఞానివి. నీ భక్తి ముల్లోకములలో ప్రసిద్ది గాంచినది. నేను శంకరుని స్మరించి ఆయన చరితమునంతనూ చెప్పెదను వినుము. (6) ఓ నారదా! ముందుగా తారకుని జన్మ వృత్తాంతమును వినుము. తారకుని వధ కొరకై దేవతలు శివుని ఆశ్రయించి గొప్ప యత్నమును చేసిరి. (7) నా మానస పుత్రుడు మరీచి. అతని కుమారుడు కశ్యపుడు. అతడు దక్షుని పదముగ్గురు కుమార్తెలను వివాహమాడెను. (8) వారిలో దితి పెద్ద భార్య. ఆమెకు ఇద్దరు కుమారులు గలరు. వారిలో హిరణ్య కశిపుడు జ్యేష్ఠుడు. వాని తమ్ముడు హిరణ్యాక్షుడు(9).

దేవతలకు మిక్కిలి దుఃఖమును కలిగించిన ఆ రాక్షసులనిద్దరినీ విష్ణువు క్రమముగా నృసింహవరాహ రూపములతో సంహరించెను. అపుడు దేవతలు భయమును వీడి సుఖించిరి. (10) . దితి దుఃఖితురాలై కశ్యపుని శరణు పొందెను. ఆమె ఆయనను మరల భక్తితో చక్కగా సేవించెను. గొప్ప దీక్ష గల ఆమె గర్భమును ధరించెను. (11). ఆ విషయమునెరింగి గొప్ప యత్నశీలుడగు మహేంద్రుడు దోషమును కనిపెట్టి, ఆమె యందు ప్రవేశించి వజ్రముతో పలుమార్లు ఆమె గర్భమును భేదించెను. (12). ఆమె వ్రతమహిమచే నిద్రించుచున్న ఆమె గర్భము మరణించలేదు. దైవాను గ్రహముచే ఆమెకు నలుభై తొమ్మిది మంది కుమారులు పుట్టిరి.(13).

మరుత్తులను పేరుగల ఆ కుమారులందరు దేవతలై స్వర్గమును పొందిరి. ఆపుడు దేవరాజగు ఇంద్రుడు వారిని తన వారినిగా చేసుకొనెను. (14). దితి తాను చేసిన దోషమునకు పరితపించి మరల భర్త వద్దకు వెళ్లి గొప్ప సేవను చేసి, ఆ మహర్షిని మిక్కిలి ప్రసన్నునిగా చేసెను.(15).

కశ్యపుడిట్లు పలికెను-

నీవు శుచివై పదివేల సంవత్సరములు బ్రహ్మను గురించి తపస్సును చేయుము. నీ వ్రతము పూర్ణము కాగలగినచో, నీకు అపుడు కుమారుడు జన్మించగలడు (16). ఓ మహర్షీ! దితి అటులనే పూర్ణమగు తపస్సును శ్రద్ధతో చేసెను. తరువాత ఆమె భర్తనుండి గర్భమును పొంది గొప్ప కుమారుని గనెను(17). దేవతలతో సమానుడగు ఆ దితి పుత్రుడు వజ్రాంగుడను పేరు గల వాడాయెను. అతడు పేరుకు తగ్గ దేహము గలవాడు, వీరుడు, గొప్ప పరాక్రమశాలి, మరియు పుట్టిన నాటినుండియూ బలశాలి (18). ఆ దితి పుత్రుడు తల్లి ఆజ్ఞచే వెను వెంటనే ఇంద్రుని, కొందరు దేవతలను కూడ బలాత్కారముగా తీసుకొని వచ్చి అనేక విధములుగా దండించెను(19).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


06 Apr 2021

No comments:

Post a Comment