గీతోపనిషత్తు -185

🌹. గీతోపనిషత్తు -185 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 26

🍀 26. ఆత్మ వైభవము - క్రమమగు సాధన చేయు సాధకునకు చంచలమగు మనస్సు క్రమముగ స్థిరచిత్తముగ మారి, బుద్ధియందు ప్రవేశించి, ఆత్మయందు లగ్నమగుట వలన మనస్సెచ్చటకు సంచరించినను, అచట ఆత్మ దర్శనము జరుగుచు, సమస్తమునందు గల ఆత్మ దర్శన మిచ్చి, ఆత్మ యందు నిలచి, ఆత్మను చూచు ఉత్తమమగు స్థితి కలుగును. జీవితము దివ్యవైభవముతో నిండియుండును. అన్నిట, అంతట, సర్వకాలముల యందు ఆత్మయందే తానున్నట్లు, తనయందు ఆత్మ యున్నట్లు భావన కలుగును. పరమ భక్తులు, యోగులు నిత్యము పొందు అనుభూతి ఇదియే. అట్టి వారికి సర్వమును దివ్యమే. దైవము యొక్క లీలావిలాసము. 🍀

యతో యతో నిశ్చరతి మన శ్చంచల మస్థిరమ్ |
తతస్తతో నియమ్యై దాత్మన్యేవ వశం నయేత్ || 26


ఈ క్రమమగు సాధన చేయు సాధకునకు చంచలమగు మనస్సు క్రమముగ స్థిరచిత్తముగ మారి, బుద్ధియందు ప్రవేశించి, ఆత్మయందు లగ్నమగుట వలన మనస్సెచ్చటకు సంచరించినను, అచట ఆత్మ దర్శనము జరుగుచు, సమస్తమునందు గల ఆత్మ దర్శన మిచ్చి, ఆత్మ యందు నిలచి, ఆత్మను చూచు ఉత్తమమగు స్థితి కలుగును.

“ఆత్మన్యేవ వశం నయేత్" అనునది ఈ శ్లోకమున ఫల శ్రుతి. చపల స్వభావముగల మానవుడు నిలకడలేని మనస్సుతో ఇదివర కెచటెచట సంచరించెనో అచటచటనే క్రమముగ ఆత్మ దర్శన మగుట కన్న అద్భుత మేమున్నది? ఇల్లు వాకిలి, భర్త భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, వృత్తి వ్యాపారాదులు, ఆస్తిపాస్తులు ఇదివరకు గోచరించిన రీతిగ గాక ఆత్మ వైభవముగ గోచరించును. తనను బంధించునవిగాక, ఆనందమునకు నిలయములై గోచరించును.

భార్యను చూచి నను, అట్లే భార్య భర్తను చూచినను పై తెలిపిన ఇతరము లన్నియు ఏమి చూచినను, అందాత్మవైభవమే గోచరించి ఆనందము కలిగించును. పూర్వము చపల స్వభావముతో చూచుట జరిగినది. అది గ్రుడ్డివాని చూపువంటిది. ప్రస్తుతము ఆత్మ, బుద్ధి, మనస్సు ఏకత్వ మొందుట వలన సమస్తము నందలి ఆత్మయే గోచరించుచు నుండును.

ఈయనుభవమునే గోపికల అనుభవముగ భాగవతము దశమ స్కంధమున వర్ణింబడినది. ఇట్టివాని జీవితము దివ్యవైభవముతో నిండియుండును. అన్నిట, అంతట, సర్వకాలముల యందు ఆత్మయందే తా నున్నట్లు, తనయందు ఆత్మ యున్నట్లు భావన కలుగును. పరమ భక్తులు, యోగులు నిత్యము పొందు అనుభూతి ఇదియే. అట్టి వారికి సర్వమును దివ్యమే. దైవము యొక్క లీలావిలాసము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


14 Apr 2021

No comments:

Post a Comment