శ్రీ శివ మహా పురాణము - 385


🌹 . శ్రీ శివ మహా పురాణము - 385🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 15

🌻. తారకుని తపస్సు - 2 🌻


ఓ మహర్షీ! ఈ తీరున బహు విధముల ఉత్పాతములు పుట్టినివి. అచటి అజ్ఞానులగు జనులు జగత్తునకు ప్రలయము వచ్చుచున్నదని తలపోసిరి. (17) తరువాత కశ్యప ప్రజాపతి విమర్శలను చేసి, మహాతేజశ్శాలియగు ఆ రాక్షస బాలకునకు తారకుడని పేరు పెట్టెను(18). మహా వీరుడు , ప్రకటింపబడుచున్న స్వీయ పౌరుషము గలవాడు నగు ఆ తారకుడు పర్వతమువలె పాషాణదృఢమగు శరీరముతో శీఘ్రముగా పెరుగ మొదలిడెను.(19) గొప్ప బలపరాక్రమములు గలవాడు, దృఢచిత్తము గలవాడునగు ఆ తారకుడపుడు తపస్సును చేయుటకు తల్లి ఆజ్ఞను వేడుకొనెను.(20)

మాయావులనైనా మోహింప చేయగలిగే ఆ మాహామాయావి తల్లి ఆజ్ఞను పొంది, దేవతలనందరినీ జయించుటకై తపస్సును చేయుటకు మనస్సులో నిశ్చయించుకొనెను(21). పెద్దల ఆజ్ఞను పాలించి అతడు మధువలమును చేరి బ్రహ్మ గారినుద్ధేశించి మిక్కిలి తీవ్రముగు తపస్సును యథావిధిగా చేసెను.(22) అతడు చేతులు పైకెత్తి ఒక కాలిపై నిలబడి సూర్యుని చూచుచూ దృఢమగు మనస్సు దృఢమగు దీక్ష గలవాడై వంద సంవత్సరములు తపస్సు చేసెను(23). దృఢనిశ్చయము గలవాడు, రాక్షసులకు అధీశ్వరుడు అగు ఆ తారకుడు బొటన వ్రేలిపై నిలబడి అదే తీరున వంద సంవత్సరములు తపస్సు చేసెను(24).

అతడు వంద సంవత్సరములు నీటిని మాత్రమే త్రాగుచూ , వంద సంవత్సరములు గాలిని మాత్రమే భక్షించి, వంద సంవత్సరములు నీటిలో నిలబడి, మరియు వంద సంవత్సరములు నేలపై నిలబడి తపస్సును చేసెను (25). వంద సంవత్సరములు అగ్నుల మధ్యలో , వంద సంవత్సరముల శీర్షాసనములో మరియు వంద సంవత్సరములు అరిచేతిపై నేలమీద నిలబడి తపస్సును చేసెను(26). ఓ మహర్షీ! వంద సంవత్సరములు చెట్టు కొమ్మనుండి కాళ్లతో వ్రేలాడుతూ , మరియు క్రిందకు వ్రేలాడు ముఖముతో నిప్పులనుండి వెలువడు పొగను త్రాగి తపస్సును చేసెను.(27) ఈ విధముగా ఆ రాక్షస రాజు వినువారలకు కూడ సంహింపశక్యము గాని ఘోరతపస్సును తన కోరిక సిద్ధించుటకై యథా విధిగా చేసెను(28).

ఇట్లు తపస్సును చేయుచున్న ఆ తారకుని శిరస్సు నుండి గొప్ప తేజస్సు బయల్వెడలి అంతటా వ్యాపించి గొప్ప విపత్తును కలిగించెను. ఓ మహర్షీ!(29). దానిచే ఆ దేవలోకములు దహింపబడుచున్నవా అన్నట్లుండెను. ఓ మునీ! దేవతలు,మునులు అందరూ అన్ని వైపుల నుండియూ దుఃఖమును పొందిరి (30). అపుడు దేవరాజగు ఇంద్రుడు కూడా 'వీడేవడో తపస్సును చేసి నా పదవిని ఊడలాగుకొనునేమో !'అని భయపడెను. (31) పరమేశ్వరుడు అకాలములో బ్రహ్మంజ ప్రలయమును చేయుచున్నాడని దేవతలు సందేహమును పొందిరి. వారికి నిశ్చయము కలుగలేదు(32).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


14 Apr 2021

No comments:

Post a Comment