శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 257 / Sri Lalitha Chaitanya Vijnanam - 257


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 257 / Sri Lalitha Chaitanya Vijnanam - 257 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 62. ధ్యానధ్యాతృ ధ్యేయరూపా, ధర్మాధర్మ వివర్జితా ।
విశ్వరూపా, జాగరిణీ, స్వపంతీ, తైజసాత్మికా ॥ 62 ॥ 🍀


🌻 257. 'జాగరిణీ'🌻

మేలుకొని యుండునది, మేలుకొలుపునది, మెళకువగ జీవుల యందుండునది శ్రీమాత అని అర్థము. ప్రళయమున నున్న సృష్టియందు మొట్టమొదటగ మేల్కొనునది శ్రీమాత. నిద్రవంటి స్థితి నుండి ఆమె మేల్కాంచుటయే సృష్టి కారణము. అది నిద్రవంటి స్థితియే గాని నిద్ర కాదు. తనకు తానుగ మేల్కొనును. మేల్కొనిన దగ్గర నుండి కదలిక ప్రారంభమగును. శ్రీమాత కదలిక

వలననే కదలుచున్న సృష్టి యేర్పడును. కదలిక ఉన్నంత కాలము సృష్టి యుండును. కదలిక అను పదము నుండే జగత్తు అను పదము పుట్టినది.

జగత్తు అనగా జనించుట, గమనమును పొందుట, స్థిరముగ నున్నట్లు గోచరించుట. ఇట్టి సృష్టి జననము, గమనము, స్థిరత్వము శ్రీమాత మేల్కొని యుండుట వలననే. ఆమె మేల్కొనుటయే సృష్టికి కూడ మేలుకొలుపు. జీవులు నిద్రనుండి మేల్కొనుట కూడ శ్రీమాత అనుగ్రహముననే జరుగును. అనుగ్రహహీనులు, మేలుకొనలేక మత్తుగ పడియుందురు. నిద్రాసక్తులందరూ శ్రీమాత అనుగ్రహమును అంతంత మాత్రముగ పొందువారే. అనుగ్రహము కలవారు నిద్ర నుండి ఉత్సాహముతో మేల్కాంతురు. వారి ముఖములు కూడ ప్రాతః సమయమున తేజో వంతములై యుండును. అనుగ్రహహీనుల ముఖములు ప్రాతః కాలమున బరువుగ నుండును. నిద్రనుండి ఉత్సాహముగ వేకువ జాముననే మేల్కొనుట యందు ఆసక్తి కలవారు శ్రీమాతను మిక్కుటముగ ప్రార్థించవలెను.

నిద్ర నుండి మేల్కొనుట ఒక యెత్తు. అజ్ఞానము నుండి మేల్కొనుట మరియొక యెత్తు. అజ్ఞానము నుండి జ్ఞానము లోనికి మేల్కొనుటకు కూడ శ్రీమాత అనుగ్రహము ఆవశ్యకమై యున్నది. కేవలము నిద్ర నుండి మేల్కొని ఇంకనూ జ్ఞానమున మేల్కొనని జీవులందరూ స్వప్న జీవనమునే జీవించు చుందురు. ఇట్టి స్వప్నము నుండి కూడ మేల్కాంచుట జరిగినపుడు, నిజమగు జాగృతి యందున్నట్లు. ఇట్టి జాగృతిని ప్రసాదించునది శ్రీమాతయే. ఎన్ని విధములుగ చూచిననూ శ్రీమాత అనుగ్రహమే జాగరణ స్థితి కలిగించును. కావున ఆమె జాగరిణి అని కీర్తింపబడుచున్నది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 257 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Jāgariṇī जागरिणी (257) 🌻


The three stages viz. awake, dream and deep sleep are now being discussed from this nāma till 263.

She is in the form of waking state in the living beings. In Śiva Sūtra (I.8) says, “jñānaṁ jāgrat”. The stage of jāgrat (the stage of awake) is explained thus:

‘The knowledge obtained by consciousness by direct contact with the external objects’. Here the subject (mind) is in direct contact with the object (material world) and knowledge is derived with the help of sensory organs. In the previous nāma, She was addressed as ‘Viśvarūpa’. Her Viśvarūpa form exists in the form of jāgrat in all living beings. This and subsequent nāma-s emphasize the omnipresent nature of the Brahman.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


26 Apr 2021

No comments:

Post a Comment