శ్రీ శివ మహా పురాణము - 379


🌹 . శ్రీ శివ మహా పురాణము - 379 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 13

🌻. పార్వతీ పరమేశ్వర సంవాదము - 2 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆమె సాంఖ్య శాస్త్రాను సారముగా పలికిన ఈ మాటలను విని శివుడు వేదాంత సిద్ధాంతము నాశ్రయించి శివా దేవితో నిట్లు పలికెను (22).

శ్రీ శివుడు ఇట్లు పలికెను-

ఓ పార్వతీ! నీవు సాంఖ్య సిద్ధాంతమునను సరించి ఇట్లు పలుకుచుంటివా? ఓ అందమైన పలుకులు గలదానా! అట్లైనచో, నీవు ప్రతి దినము నా సేవను చేయుము. నాకు నిషేధము లేదు (23). నేను మాయా లేపము లేని వాడను, పరమేశ్వరుడను, వేదాంతములచే తెలియదగు పరబ్రహ్మను, మాయను వశము చేసుకున్నవాడను అయినచో, అపుడు నీవేమి చేయగలవు? (24)

బ్రహ్మ ఇట్లు పలికెను-

భక్తులను రంజింపజేసి, అనుగ్రహించు ఆ ప్రభుడు పార్వతితో నిట్లు పలికి, తరువాత హిమవంతునితో నిట్లనెను (25).

శివుడిట్లు పలికెను-

ఓ పర్వత రాజా! నేను ఇచట నీ ఈ అతి సుందర పీఠ భూమి యందు మహా తపస్సును చేసెదను. అనందఘనము, పరమతత్త్వము, సద్ఘనమునగు ఆత్మ స్వరూపమును దర్శించుచూ ఈ భూమి యందు సంచరించెదను (26). ఓ పర్వతరాజా! నేను ఇచట తపస్సును చేసుకొనుటకు అనుజ్ఞనిమ్ము అనుజ్ఞ లేకుండగా నీ ఈ స్థానమునందు ఏ విధమైన తపస్సునైననూ చేయుట సంభవము కాదు (27).

బ్రహ్మ ఇట్లు పలికెను-

దేవదేవుడు, త్రిశూలధారి యగు ఆ శివుని ఈ వచనమును విని, హిమవంతుడు శివునకు నమస్కరించి ఇట్లు పలికెను (28).

హిమవంతుడిట్లునెను-

దేవతలు, రాక్షసులు, మనుష్యులతో గూడిన జగత్తు అంతయూ నీదే. హే మహాదేవా! నేను అత్యల్పుడను. నీతో నేనేమి చెప్పగలను? (29)

బ్రహ్మఇట్లు పలికెను-

హిమవంతుడిట్లు పలుకగా, లోకములకు మంగళమునిచ్చే శంకరుడు నవ్వి హిమవంతునితో సాదరముగా 'నీవు వెళ్లుము' అని చెప్పెను (30). హిమవంతుడు శంకరుని అనుమతిని పొంది తన ఇంటికి వెళ్లెను. ఆయన ప్రతిదినము పార్వతితో గూడి శంకరుని దర్శించుచుండెను (31). భక్తి తత్పరురాలగు ఆ కాళి ప్రతి దినము తండ్రి రాకపోయిననూ, ఇద్దరు చెలికత్తెలతో గూడి సేవకొరకై శంకరుని సమీపమునకు వెళ్లుచుండెను (32). వత్సా! మహేశుని ఆజ్ఞను పాలించే పవిత్ర హృదయుడగు నందీశ్వరుడు, ఇతర గణములు శివుని ఆజ్ఞచే ఆమెను వారించలేదు (33).

జాగ్రత్తగా పరిశీలించినచో శివాశివుల మధ్య భేదమే లేదు. అట్టి వారిద్దరు క్రమముగా సాంఖ్యవేదాంత మతములననుసరించి చేసిన సుఖకరమగు సంవాదమును వివరించితిని. ఈ సంవాదము సర్వదా మంగళములను కలిగించును (34). జితేంద్రయుడగు శంకరుడు పర్వతరాజు నందు గల గౌరవముచే ఆతని మాట ప్రకారంగా ఆతని కుమార్తెను తన వద్దకు వచ్చుటకు అంగీకరించెను (35). జితేంద్రియుడగు శివుడిట్లు పలికెను. ఈ కాళి సఖరాండ్రిద్దరితోగూడి ప్రతిదినము నన్ను సేవించి వెళ్లవచ్చును. మరియు ఇచట నిర్భయముగా నుండవచ్చును (36). ఇట్లు పలికి, వికారములు లేనివాడు, మహాయోగీశ్వరుడు, అనేక లీలలను ప్రదర్శించువాడునగు శివ ప్రభుడుఆ దేవిని సేవకొరకై స్వీకరించెను (37).

ధీరులగు తపశ్శాలురకు విఘ్నములు వచ్చుచుండును. కాని అవి వారి తపస్సును భంగము చేయజాలవు. అదియే వారికి గల గొప్ప ఐశ్వర్యము (సామర్థ్యము) (38). ఓ మహర్షీ ! అపుడు పర్వతరాజు సేవకులతో గూడి తన పురమునకు మరలివచ్చెను. ఆతడు మనస్సులో గొప్ప ఆనందమును పొందెను (39). శివుడున్నూ విఘ్నముల పీడలేని తన మనస్సుతో ధ్యానయోగము నభ్యసించుచూ, ఆత్మ రూపమును ధ్యానించుచుండెను (40). కాళీ దేవి సఖురాండ్రిద్దరితో గూడి ప్రతిదినము అచటకు వచ్చి చంద్ర భూషణుడగు మహాదేవుని సేవించి మరలు చుండెను (41). ఆమె శంభుని పాదములను కడిగి ఆ పాదోదకమును త్రాగెడిది. మరిగించిన నీటిలో శుభ్రము చేయబడిన వస్త్రముతో శివుని శరీరమును తుడిచెడిది (42).

ఆమె ప్రతి దినము శివుని యథావిధిగా షోడశోపచారములతో పూజించి, మరల మరల నమస్కరించి తండ్రి గృహమునకు మరలుచుండెడిది (43).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


02 Apr 2021

No comments:

Post a Comment