మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 7
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 7 🌹
✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : పవన్
📚. ప్రసాద్ భరద్వాజ
🌸. మహాపూర్ణవాణి 🌸
🌻. సాధనలో ఉన్న సాధకులు ముఖ్యంగా ఈ ఒక్క విషయం బాగా గుర్తుంచుకోవాలి. హృదయాన్ని పరమాత్మ సంకల్పానికి అభిముఖంగా ఉంచుకొన్నావా లేదా అని. 🌻
నీవు ఎంత జపం చేశావు అని చూడడు పరమాత్మ. ఎంత నామం చేశావు అని చూడడు- ఎలా చేశావు అని మాత్రమే చూస్తాడు.
నీ హృదయాన్ని పరమాత్మ సంకల్పానికి అభిముఖంగా ఉంచుకొని చేశావా లేదా అని మాత్రమే చూస్తాడు.
ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏమి జరిగినా, అది పరమాత్మ సంకల్పం వల్లే జరుగుతుంది.
మనం మంచి అనుకున్న దానికి విరుద్ధంగా జరిగినా, అది కూడా మన మనస్సు అందుకోలేని మరొక మంచికి ప్రాతిపదిక అన్న సత్యాన్ని ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి.
పరమాత్మ సంకల్పాలు ఎప్పుడు ఎక్కడ ఎలా కార్యరూపంగా పరిణమిస్తాయో ఎవరూ గ్రహించలేరు.
పరమాత్మ సంకల్పాలు బాహ్యానికి సుఖదుఃఖ రూపములుగా పరిణమించనీ, అధర్మరూపంగా అనిపించనీ, నీవు ధర్మం అనుకుంటూ చేసే ప్రచారానికి ఆటంకరూపంగా ఉండనీ -జరిగిన ప్రతిదీ ఆయన సంకల్పమే అని గుర్తించి, నీ హృదయాన్ని దానికి అభిముఖంగా ఉంచుకో!
అయ్యో, భగవంతుడు ఇలా ఎందుకు చెయ్యాలీ అనీ, విఘ్నాలు ఎందుకు కలిగించాలి అనీ అనుకోబోకు!
అయితే నీ శక్తి మేరకు ఆ ఆటంకములను నివారించడానికి ప్రయత్నం చేయకుండా మాత్రం ఊరుకోబోకు! విసుగు లేకుండా, ప్రసన్నచిత్తంతో, నా బాధ్యత నేను చెయ్యాలి అనే భావంతో నీ యత్నం నువ్వు చెయ్యి.
కర్తృత్వం నీ మీద వేసుకోకుండా చెయ్యి. పరమాత్మ ఇచ్ఛయే నెరవేరాలి, పరమాత్మ ఇచ్ఛయే మనకు క్షేమం కలిగిస్తుంది, అనే భావంతో విశ్వాసంతో చెయ్యి.
నీ మనస్సును రాగద్వేషాలకు పాల్పడకుండా ఉంచుకొని ఇలా చేస్తే, నీవు తలపెట్టిన మంచిపని- క్రతువు-బాహ్యానికి చెడిపోయినట్టు కనిపించినా, నిర్విఘ్నంగా నెరవేరినట్టే. అందువల్ల పరమాత్మ సంతోషిస్తాడు.
అలాకాక, నీ మనస్సు రాగద్వేషాలకు పాల్పడితే, ఆ క్రతువు- మంచిపని- బాహ్యానికి ఎంత వైభవంగా జరిగినట్టు కనపడినా, అది చెడిపోయినట్టే.
కాబట్టి నీ మనస్సును పరమాత్మ సంకల్పాలకు అభిముఖంగా ఉంచుకొని చెయ్యి ఏమి చేసినా!
🌹 🌹 🌹 🌹 🌹
02 Apr 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment