గీతోపనిషత్తు -179
🌹. గీతోపనిషత్తు -179 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚
శ్లోకము 21
🍀 21 -1. హృదయ కేంద్రము - ఇంద్రియములకు గ్రహింప నలవికానిది, బుద్ధికి మాత్రమే తెలియదగినది, ఆద్యంతము సుఖము నిచ్చునది అగు నేనను వెలుగు నందు స్థితుడై ఏ మాత్రము చాంచల్యము లేక యోగి సుఖానుభూతిని తెలియుచున్నాడు. ఇంద్రియములచే పొందు సుఖానుభూతి తాత్కాలికము. అది సుఖము కలిగినట్లు భ్రమ కొలుపునే గాని, నిజమగు సుఖము నీయదు. తృప్తి నివ్వని సుఖము సుఖమే కాదు. జీవుని చిత్తము మనస్సు నుండి బాహ్యమును దర్శించ వచ్చును. దేహ పోషణమునకును, బాహ్య సౌందర్య అనుభూతికిని, తదానందమునకును జీవుడు మనస్సేంద్రియములను దైవమిచ్చిన సౌకర్యములుగ చూడవలెను. ఆ సౌకర్యము దుర్వినియోగము చేయరాదు. 🍀
సుఖ మత్యంతికం యత్త ద్బుద్ధిగ్రాహ్య మతీంద్రియమ్ |
వేత్తి యత్ర న చైవాయం స్థిత శ్చలతి తత్త్వతః || 21
ఇంద్రియములకు గ్రహింప నలవికానిది, బుద్ధికి మాత్రమే తెలియదగినది, ఆద్యంతము సుఖము నిచ్చునది అగు నేనను వెలుగునందు స్థితుడై ఏ మాత్రము చాంచల్యము లేక యోగి సుఖానుభూతిని తెలియుచున్నాడు. ఇంద్రియములచే పొందు సుఖానుభూతి తాత్కాలికము. అదియును గాక సుఖము కలిగినట్లు భ్రమ కొలుపునేగాని, నిజ మగు సుఖము నీయదు.
ఉదాహరణకు రుచికరమగు వస్తువొకటి భుజించినపుడు తాత్కాలికముగ సుఖము నిచ్చును. కాని ఇంద్రియము ద్వారా మనస్సు ఆ వస్తువును పదే పదే కోరుచు నుండును. అట్లే కన్ను నుండి చూచినవి, చెవినుండి విన్నవి, ముట్టుకొన్నవి, వాసన చూసినవి మరల మరల జ్ఞప్తి చేయుచు, మరల మరల వానినే కోరుచు, వాని కొరకై జీవుని ఎడతెరిపి లేక త్రిప్పుచు నుండును.
తృప్తి నివ్వని సుఖము సుఖమే కాదు. తృప్తి కలిగినచో మరల కోరుట యుండదు కదా! కావున ఈ సుఖము తృప్తినీయక, తాత్కాలికముగ తృప్తి నిచ్చినట్లు భ్రాంతిని మాత్రమే కలిగించును. మరల మరల మనసు కోరుటకు కారణమిదియే. ఇంద్రియార్థముల వెంటబడుటకు జీవుడు మనస్సులోనికి దిగి, మనస్సునుండి ఇంద్రియములలోనికి మరింత దిగి, ఇంద్రియార్థముల వెనుక బాహ్యము లోనికి ఐదు దిశలుగ పరుగిడుతు అలసట చెంది మరణించుట జరుగును.
తృప్తి కలిగించని వాని వెంట, తృప్తి కలుగునని పరుగెత్తుట ఎంత అవివేకము! జీవుని చిత్తము మనస్సు నుండి బాహ్యమును దర్శించవచ్చును. దేహావ సరములను తీర్చుకొనవచ్చును. దేహపోషణము కూడ చేసుకొన వచ్చును. ఇవి యన్నియు వివేకముతో కూడి చేయు పనులు. వివేకము కోల్పోయిన జీవుడు మనస్సు నుండి కూడ దిగజారి పశువైపోవును.
అట్లని మనస్సను సౌకర్యమే లేనిచో, ఇంద్రియములే లేనిచో దేహ పోషణము జరుగదు. దేహ పోషణమునకును, బాహ్య సౌందర్య అనుభూతికిని, తదానందమునకును జీవుడు మనస్సేంద్రియములను దైవమిచ్చిన సౌకర్యములుగ చూడవలెను. ఆ సౌకర్యము దుర్వినియోగము చేయరాదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
02 Apr 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment