దేవాపి మహర్షి బోధనలు - 68
🌹. దేవాపి మహర్షి బోధనలు - 68 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 49. సంస్కారము - జ్ఞానము 🌻
కన్ను చూచును, చెవి వినును. కాని హృదయము సత్యా సత్యములను గ్రహించును. జ్ఞాన సముపార్జనము మనసున స్థిరపడిన వాడు తనకు ప్రత్యేకమైన గుర్తింపుకు పాట్లు పడుచుండును. అదే జ్ఞానము హృదయమున వికసించినపుడు తన ప్రత్యేకత భావమును కోల్పోయి లోకహితుడగును. మనిషి సంస్కారము ననుసరించి జ్ఞానమతనిని అహంకారిగ గాని, ఆత్మవంతునిగ గాని చేయగలదు. ఇది జ్ఞానము చేయుపనికాదు. సంస్కారము చేయుపని.
తన కొరకై పాటుపడు జ్ఞాని జ్ఞానియే కాదు. అతడు స్వార్థపరుడే. తన పరిసరము నందలి జీవుల వేదనలను గుర్తించి తాను పొందిన జ్ఞానబలముతో వారికి వినియోగపడుటయే జ్ఞానమునకు పరమావధి. వినియోగము పడని జ్ఞాని అజ్ఞానికన్నా మూర్ఖుడు. అతడిని ప్రకృతి క్షమింపదు.
దొంగ దొంగతనము చేసిన అది సామాన్య విషయము. పోలీసుయే దొంగతనము చేసినచో అది క్షమించరాని నేరము. ఇందు మొదటి వాడు అజ్ఞాని, రెండవవాడు జ్ఞాని. జ్ఞానికి కల ఏకైక కార్యము లోకహితము. లోకోద్ధరణము. అది ద్రవ్యయజ్ఞముగను, జ్ఞాన యజ్ఞముగను సాగవలెను. సంస్కారి, జ్ఞాని యగుట సవ్యమార్గము. కుసంస్కారి, జ్ఞాని యగుట అపసవ్యము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
07 Apr 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment