దేవాపి మహర్షి బోధనలు - 81


🌹. దేవాపి మహర్షి బోధనలు - 81 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 62. చర్విత చర్వణము 🌻


ప్రస్తుత కాలము పూర్వకాలమును గుర్తుచేయు చున్నది. కాల చక్రమున మానవజాతి చరిత్రలో చేసిన పొరపాట్లే మరల చేయుట కనిపించును. ఇప్పుడు జరుగుచున్న సంఘటనలన్నియు వినాశమును ప్రోత్సహించునవిగ గోచరించుచున్నవి. అట్లాంటిస్ నాగరికత జలమయం కాకముందు వారును యిట్లే ప్రవర్తించిరి.

సన్నివేశముల వివరములలో క్రొత్తదనమున్నదిగాని విధానమంతయు పాతయే. అపుడును నకిలీ భాష్యకారులు, కపటయోగులు చాలమంది పామరులను భ్రష్టు పట్టించినారు. ఇప్పుడును అదే జరుగుచున్నది. ఓనమ లు రానివారు గూడ మహాత్ములుగ గుర్తింపబడుటకు తపన చెందుతున్నారు. కపట వేషణము, భాషణము, సత్యదూరమగు సాధనా పద్ధతులు, భ్రమల యందాకర్షణ అప్పుడును జరిగినది, ఇప్పుడును జరుగుచున్నది. కృతఘ్నత, ఆధ్యాత్మిక అనాగరికత, ఆటవిక ఆధ్యాత్మిక ప్రదర్శనములు అప్పుడు ఇప్పుడును గూడ మరల మిక్కుటముగ గోచరించుచున్నవి.

అట్లాంటిస్ నాగరికతలో గూడ ఆకాశగమన విద్య గలదు. వారును వినువీధిలో త్వరితముగ ప్రయాణము చేయుటకు పరికరములు కలిగియుండిరి. వేగముగ కదలుటకు, త్వరితముగ కబళించుటకు, బలముతో ఆక్రమించుటకు ఆ పరికరములను వాడుచుండిరి. అప్పుడును ఇప్పుడును కూడ భౌగోళిక సంచారము, గ్రహాంతర సంచారము జరిగినది, జరుగుచున్నది.

అప్పుడును ఇప్పుడును కూడ ఆలయములను ధ్వంసము చేయుట, అపవిత్రము చేయుట, అపహాస్యము చేయుట జరిగినవి, జరుగుచున్నవి. సోమనాథుడు, కాశీ విశ్వేశ్వరుడు, అయోధ్యా రాముడు, మధురానాథుడు భారతమున అవమానింపబడినట్లే, మధ్య ఆసియాలో శాంతి నిలయమైన జెరూసలేము దేవాలయము, దక్షిణ అమెరికాలో శంబళకు ప్రతీకయైన ఇబెజ్ (IBEZ) దేవాలయము, మధ్య అమెరికాలో గల అమేరు దేవాలయములు అవమానింపబడినవి.

అపుడును ధర్మోల్లంఘనము మితిమీరి జరిగినది. ఇపుడును జరుగుచున్నది. అపుడును భూమి అంతర్భాగములలో మానవులు అలజడి కలిగించిరి. ఇప్పుడును అదే పని చేయుచున్నారు. చేసిన పొరపాట్లే మరల చేయుట వలన, ఇదివరకటి ఫలితములే మరల పొందవలసియుండును. మానవజాతి జీవనము చక్ర భ్రమణమున సాగుచున్నదేగాని ఆరోహణ క్రమము కొద్దిమందికే అలవడుచున్నది. జాతి కథ చర్విత చర్వణమే.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


07 May 2021

No comments:

Post a Comment