దేవాపి మహర్షి బోధనలు - 100


🌹. దేవాపి మహర్షి బోధనలు - 100 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 78. మధుర మార్గము -4 🌻


నూతనత్వము మాధుర్య మార్గమునకు పునాదియని తెలిపితిమి. నూతనత్వము ఆనందము కలిగించును. ఆనందము తుష్టిని, పుష్టిని కలిగించును. శ్రీకృష్ణుడు నిత్యనూతనుడు. అతడెప్పు డెట్లుండునో ఎవరునూ ఊహించలేరు. ఎట్లు ప్రవర్తించునో అసలే తెలియదు. అతనియందంతయు నూతనత్వమే. అతను నిత్యనూతను డగుటచే అతనిని గూర్చిన భావన నిత్యానందకరము. బాలురు, స్త్రీలు, వృద్ధులు, వీరులు, వైరులు, మిత్రులు, భార్యలు, బంధువులు ఎవ్వరునూ అతని చేష్టలను ముందుగ నూహింపలేకపోయిరి.

అతని నుండి కార్యములు జరుగుచున్నప్పుడు చూచి ఆశ్చర్యపడుట, ఆనందపడుట, దైనందిన చర్యగ మారినవి. అతడిట్లు తన పరివారము నంతను ఉత్సాహమున నుంచెను. చిల్లర విషయములందు వారికి గల ఆసక్తిని తన సాన్నిధ్యములోనికి మరల్చెను. అతని వేణుగానముతో భూమిని, పశుపక్ష్యాదులను ప్రచోదనము గావించెను.

ఆ వేణుగాన తరంగములే నెమరు వేసుకొనుచు భూమి, దానిని ఆవరించియున్న పంచభూతములు, గురుపరంపర ఇనుమడించిన ఉత్సాహముతో కర్తవ్యములను నిర్వర్తించుచున్నవి. ఈ మధుర సాన్నిధ్య మార్గముల కన్న మించిన మార్గమేదియు లేదని మధురాధిపతి తన చివరి సందేశముగ జీవుల కందించెను.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


18 Jun 2021

No comments:

Post a Comment