దేవాపి మహర్షి బోధనలు - 106
🌹. దేవాపి మహర్షి బోధనలు - 106 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 87. సంస్కారము 🌻
సద్భావములు, శుభములు ఎటునుండి వచ్చినను, ఎవరి ద్వారా వచ్చినను నిరాకరింపకుము. కేవలము స్వార్థపరత్వముతో కాకపక్షపాత రహితముగ వినుము. పక్షపాత రహితముగ చూడుము, మాట్లాడుము. స్వార్థ దృష్టితో చూచినప్పుడు దివ్యమగు విషయములు కూడ ఆనందము కలిగించలేవు.
నీ హృదయమున తోటివారి విజయము నందు, సౌఖ్యము నందు ఎట్టి భావము కలిగియుందువో అదియే నీ సంస్కారమునకు కొలబద్ద. తోటివారిని సహించలేక పోవుట, అతనికి జరుగుచున్న మంచిని చూచి సహజముగ సంతోషింప లేకపోవుట నిజమగు దుఃఖము. ఈ దుఃఖము నుండి బయల్పడుట సామాన్యము కాదు. అసామాన్యమే. తెలిసిన వారు కూడ తోటివాని ఉన్నతిని హృదయపూర్వకముగ ఆనందించలేరు.
అంగీకరింపనే లేరు. ఇట్టి ఈర్ష్యాళువులు దైవారాధనము చేసిన ఏమి ఫలము? తోటి జీవుని ఆనందమే తన ఆనందముగ భావించుట లోకహితుని లక్షణము. వారి బాధ తమ బాధగ భావించుట, వలసిన సహాయము చేయుట కూడ వారి లక్షణము. ఇది నేర్వనివారు జ్ఞానమునకై ఆరాటపడుట వ్యర్థము.
ఇతరుల ఉన్నతిని, సద్గుణములను, విజయములను, వారికి కలుగు శుభములను నీవు విన్నప్పుడు హృదయమున ఆనంద స్పందన కలిగినచో నీవు సంస్కారుడవు. లేనిచో నీది కుసంస్కారమే. కుసంస్కారులకు దైవము ప్రతిస్పందింపదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
30 Jun 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment