గీతోపనిషత్తు -217


🌹. గీతోపనిషత్తు -217 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚

శ్లోకము 6 -2


🍀 5-2. ఉత్తమ భావములు - చిత్త మందలి బలమగు సంస్కారములే తదనుగుణమగు భావములను సృజింప జేసి ఆ యా మార్గములలో నడిపించును. చిత్తమున ఏర్పడు బలమగు సంస్కారమే కామము. దానివలననే లోకములందలి జీవులందరును నడిపింప బడుచున్నారు. దైవకామ మేర్పడుట, ధర్మకామ మేర్పడుట వలన దైవమును చేరుట ఎట్లో, అట్లే ఇతర కామములు జీవులను ఆయా గతులలో నడిపించుచున్నవి. కనుక సాధకులు తమ చిత్త మందలి సంస్కారములను పరిశీలించుకొని, అను నిత్యము ఉత్తమ సంస్కారములకై కృషి సలుపవలెను. 🍀

యం యం వాపి స్మరన్ భావం త్యజ త్యంతే కలేబరమ్ |
తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః || 6


తాత్పర్యము :

దేహము త్యజించు సమయమున ఎవరెవరు ఏయే భావములను స్మరింతురో అట్టి భావముల లోనికే చను చుందురు.

వివరణము :

చిత్త మందలి బలమగు సంస్కారములే తదనుగుణమగు భావములను సృజింప జేసి ఆయా మార్గములలో నడిపించును.

సత్యకాముడైనను, ధర్మకాముడైనను, ధనకాముడైనను, కీర్తికాముడైనను, స్త్రీ కాముడైనను ఇట్లే బలీయముగ వారి బలమగు కామముచే ఈడ్చుకొని పోబడుచున్నారు. చిత్తమున ఏర్పడు బలమగు సంస్కారమే కామము. దానివలననే లోకములందలి జీవులందరును నడిపింప బడుచున్నారు. దైవకామ మేర్పడుట, ధర్మకామ మేర్పడుట వలన దైవమును చేరుట ఎట్లో, అట్లే ఇతర కామములు జీవులను ఆయా గతులలో నడిపించుచున్నవి.

కనుక సాధకులు తమ చిత్త మందలి సంస్కారములను పరిశీలించుకొని, అను నిత్యము ఉత్తమ సంస్కారములకై కృషి సలుపవలెను. ఉత్తమోత్తమ సంస్కారము, ఉత్తమోత్తమ లోకములకు చేర్చగలదు. నిత్యము ఆత్మ పరిశీలనము గావించుచు చిత్తమందలి ఉత్తమ భావములకు కార్యాచరణ పథక మేర్పరచుకొనుట పరిష్కారమై యున్నది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


25 Jun 2021

No comments:

Post a Comment