శ్రీ శివ మహా పురాణము - 417


🌹 . శ్రీ శివ మహా పురాణము - 417🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 24

🌻. దేవతలు శివునితో మొరపెట్టుకొనుట - 2 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను-

శంభుని ఈ మాటలను విని దేవతలందరు ఆనందముతో నిండినవారై, శంభునకు విన్నవించు కొరకై విష్ణువు యొక్క ముఖము వైపునకు చూచిరి (11). అపుడు మహాభక్తుడు, దేవతలకు మేలు చేయువాడునగు విష్ణువు గొప్ప దేవకార్యమును సాధింపగోరి నేను చెప్పిన ఈ మాటలను పలికెను (12). హే శంభో! తారకుడు దేవతలకు పరమాశ్చర్యకరమగు పద్ధతిలో తీవ్రవేదనలను కలిగించుచున్నాడు. ఆ సంగతిని విన్నవించుటకై దేవతలందరు ఇచటకు వచ్చియున్నారు (13). హే శంభో! నీనుండి జన్మించిన నీ కుమారుని చేతిలో మాత్రమే ఈ తారకాసురుడు హతుడగును. నామాట తప్పు గాదు (14).

ఓ మహాదేవా! నీవీ విషయమును విమర్శించి దయను చూపుము. నీకు నమస్కారమగు గాక! ఓ స్వామీ! తారకుడు కలిగించిన కష్టములనుండి దేవతలను ఉద్ధరించుము (15). హే దేవా! శంభో! కావున నీవు నీ కుడిచేతితో పార్వతిని స్వీకరించవలెను. పర్వతరాజు సమర్పించగా మహాపతివ్రతయగు ఆమెను పాణి గ్రహణము చేయుము (16). విష్ణువు యొక్క మాటలను విని శివుడు ప్రసన్నుడాయెను. యోగ నిష్ఠుడగు శివుడు వారందరికీ మంచి మార్గమును చూపుచున్నవాడై ఇట్లు పలికెను (17).

శివుడిట్లు పలికెను-

నేను సర్వాంగ సుందరియగు పార్వతీ దేవిని స్వీకరించిన వాడు దేవతలు, దిక్పాలకులు, మునులు, ఋషులు అందరు (18) కోరిక తీరిన వారు కాగలరు. కాని వారు మోక్ష మార్గమునందు సమర్థులు కాజాలరు. పాణిగ్రహణ మాత్రముచే ఆ దుర్గ మన్మథుని జీవింపచేయగలదు (19). హే విష్ణో! అందరి కార్యము సిద్ధించుట కొరకై బ్రహ్మ యొక్క వచనముననుసరించి నేను మన్మథుని దహించితిని. ఈ విషయములో నీవు విమర్శ చేయకుము (20). ఏది కర్తవ్యము, ఏది కాదు అను వ్యవస్థను చేయుటలో వివేకి మనస్సులో చక్కగా విమర్శను చేయవలెను. ఓ దేవేంద్రా! నీవు దేవతలందరితో గూడి హఠమును చేయదగదు (21).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


25 Jun 2021

No comments:

Post a Comment