దేవాపి మహర్షి బోధనలు - 99


🌹. దేవాపి మహర్షి బోధనలు - 99 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 78. మధుర మార్గము -3 🌻


శ్రీకృష్ణ సాన్నిధ్యము ప్రకృతినే పరవశింప చేసినది. శత్రువులేమి లెక్క. శత్రువులను చంపు శ్రమ అర్జునునిది. అతడు సంహరింపక ముందే శ్రీకృష్ణుడా జీవులందరిని తనలోనికి ఆకర్షించినాడు. “అర్జునా! నీవు ప్రత్యేకముగ చంపున దేమియు లేదు. వీరందరును చనిపోయియే యున్నారు.” అని కృష్ణుడు పలికి నప్పుడు అర్జునునికి అర్థము కాలేదు.

పది దినములపాటు భీష్ముడు కృష్ణుని చూచుచు యుద్ధమున నిలచి మధురానుభూతిని పొందినాడు. తన నెట్లును శ్రీకృష్ణుడు పరిపూర్ణముగ నాకర్షించెను. తన శరీరమున గూడ అతని దివ్యాయుధ స్పర్శచే పులకింప చేయమని ప్రార్థించినాడు. తెలిసియు ఆకర్షితులై యుద్ధమున మరణించినారు. కృష్ణ సాన్నిధ్య మాధుర్యము వారికే దక్కినది. ఆ మాధుర్యము అర్జునునికి దక్కకపోవుట విచిత్రము. శ్రమయే అతనికి మిగిలినది. కృష్ణ భక్తి మాధుర్యమున శ్రమ లేదు. తాను చేయుచున్నా నన్న భావనయే యుండదు.

పరమాత్మ అకర్తగ నుండి జీవులను అకర్తస్థితికి చేర్చినాడు. మోక్షమని తెలియకయే కృష్ణభక్తులు మోక్షము పొందినారు. అతని సాన్నిధ్యము మోక్షమునే సన్యసింపచేయు యోగము. మోక్షమునందుండుటయే గాని మోక్షము నందున్నామను కొనుట బంధమే. మోక్షమును కోరుట చిక్కుముడి. శ్రీకృష్ణుని వేణుగానము జీవులను అప్రయత్నముగ అత్యున్నత స్థితి యందుంచినది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


15 Jun 2021

No comments:

Post a Comment