🌹. గీతోపనిషత్తు -239 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚
శ్లోకము 19-2
🍀 18-2. నిద్ర - మెలకువ - నిద్రించుటయు, మేల్కాంచుటయు జీవులకు అవశమై యున్నది. నిద్ర మెలకువ వచ్చుటయే గాని తెప్పించు కొనలేము. ఇది అవశస్థితి. అట్లే జన్మించుట, మరణించుట కూడ. అట్లే సృష్టి, ప్రళయము కూడ. ఈ చక్రము నుండి జీవులు బయల్పడుట ప్రయత్న పూర్వకముగ చేయవలెను. ఈ చక్రగతి దాటుటకు చక్రమును త్రిప్పుచున్న తత్త్వముతో ముడిపడవలెను. చక్రము నందుండుట ఒక ఎత్తు, చక్రమును త్రిప్పు తత్త్యముతో యుండుట మరియొక ఎత్తు. పరబ్రహ్మ యోగమున ఇది సాధ్యపడునని భగవానుని ఉపదేశము. 🍀
భూత గ్రామ స్స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే |
రాత్ర్యాగమే2 వశః పార్థ ప్రభవ త్యహరాగమే || 19
తాత్పర్యము : ప్రాణి సమూహము లన్నియు కూడ పరాధీనమై పగటి యందు మేల్కొని, వర్తించి మరల పరాధీనమై రాత్రియందు నిదురలోనికి చనుచున్నవి. బ్రహ్మపగలు యందు కూడ ప్రాణి సమూహము అట్లే అవశులై పుట్టుచు చచ్చుచు, మరల పుట్టుచు జీవించి బ్రహ్మరాత్రి యందు లయమందు చున్నది.
జీవులు మేల్కొనక ముందు తామున్నామని తెలిసి యుండరు. మేల్కొనినంతనే తెలియును. ఆ తెలివి నిద్రవరకే. నిద్రయందు తెలివి అవ్యక్తము లోనికి చనును. మరల మెలకువ కలిగినంతనే ఏర్పడును. నిద్రించుటయు, మేల్కాంచుటయు జీవులకు అవశమై యున్నది. నిద్ర వచ్చుటయేగాని, నిద్రను తెప్పించుకొనలేము. మెలకువ వచ్చుటయేగాని, మెలకువను తెప్పించుకొనలేము. ఇది అవశస్థితి. అట్లే జన్మించుట, మరణించుట కూడ. అట్లే సృష్టి, ప్రళయము కూడ.
ఈ చక్రము నుండి జీవులు బయల్పడుట ప్రయత్న పూర్వకముగ చేయవలెను. ఆ ఉపాయము తరువాత శ్లోకమున పరమాత్మ తెలియజేయు చున్నాడు. సృష్టి లయములకు, జనన మరణములకు, మెలకువ నిద్ర లకు అతీతమైన, అక్షరమైన పరతత్త్వమును గుర్తించి, దానితో ముడిపడుటయే మార్గమని తెలియచేయును. సృష్టిచక్రము, జనన మరణ చక్రము, అహోరాత్ర చక్రము, జీవులను శుక్ల కృష్ణ గతులలో అనంతము త్రిప్పుచునే యుండును.
ఈ చక్రగతి దాటుటకు చక్రమును త్రిప్పుచున్న తత్త్వముతో ముడిపడవలెను. చక్రము నందుండుట ఒక ఎత్తు, చక్రమును త్రిప్పు తత్త్యముతో యుండుట మరియొక ఎత్తు. పరబ్రహ్మ యోగమున ఇది సాధ్యపడునని భగవానుని ఉపదేశము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
13 Aug 2021
No comments:
Post a Comment