శ్రీ శివ మహా పురాణము - 438


🌹 . శ్రీ శివ మహా పురాణము - 438🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 28

🌻. శివుని సాక్షాత్కారము - 1 🌻


పార్వతి ఇట్లు పలికెను-

ఎవరో ఒక మహాత్ముడు వచ్చినాడని మాత్రమే నేను తలంచితిని, ఇపుడు విషయమంతయూ తెలిసినది. పైగా నీవు పవిత్రమగు బ్రాహ్మణుడు (1). ఓ దేవా! నీవు చెప్పినది నాకు తెలిసినది. అది అసత్యమే గాని సత్యము కాదు. సర్వము తెలియునని నీవు చెప్పిన మాట సత్యమే అయినచో, నీవు ఇట్లు విరుద్ధముగా మాటలాడియుండవు (2).

పరబ్రహ్మ, తన ఇచ్ఛచే స్వీకరింపబడిన దేహము గలవాడునగు మహేశ్వరుడు అప్పుడప్పుడు తన లీలచే అట్టి వేషమును ధరించి కానవచ్చును (3). నీవు బ్రహ్మచారి వేషముతో నన్ను మోసగించుటకు వచ్చి కుయుక్తులు పన్ని మోసపూరితములగు మాటలను పలికితివి (4).

నేను శంకరుని స్వరూపమును ప్రత్యేకించి ఎరుంగుదును. శివతత్త్వము నెరుంగుదును. కావున నా యోగ్యతకను గుణముగా బాగుగా విమర్శించి చెప్పుచున్నాను (5). శివుడు స్వరూప దృష్ట్యా నిర్గుణ బ్రహ్మ. కాని కారణమగు ప్రకృతితో గూడి సగుణుడైనాడు. నిర్గుణుడు, గుణ స్వరూపుడునగు ఆయనకు జాతి ఎట్లుండును? (6)

ఆ సదాశివుడు విద్యలన్నింటికీ నిధానము. పూర్ణపరమాత్ముడగు ఆ శివునకు విద్యతో పనియేమి? (7)ఆ శంభుడు కల్పప్రారంభములో వేదములను ఉచ్ఛ్వాస రూపముగా పూర్వము విష్ణువునకు ఇచ్చెను. ఆయనతో సమమగు గొప్ప ప్రభువు మరియొకడు లేడు (8).

సర్వప్రాణులకు ఆదియందున్న సద్ఘనుడగు పరమేశ్వరునకు వయస్సు యొక్క లెక్క ఎక్కడిది? ప్రకృతి ఆయన నుండి పుట్టినది. ఆయన యొక్క శక్తికి కారణమేమి ఉండును? (9) శక్తికి ప్రభువు, అవ్యయుడు అగు ఆ శంకరుని ఎవడైతే సర్వదా ప్రేమతో సేవించునో, అట్టివానికి ఆ శంభుడు ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తులను ఇచ్చును (10).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


13 Aug 2021

No comments:

Post a Comment