✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚
శ్లోకము 21
🍀 20. పరంధామము - ఈ సమస్త సృష్టికి ఆధారమగు సత్యమే తన శాశ్వత నివాసస్థానమని, అట్టి సత్యమే రూపు గట్టుకొని అర్జునుని ముందు నిలబడి యున్నదని, పరము, అక్షరము, బ్రహ్మము అగు తానే తన ప్రకృతిని కూడి ఉన్ముఖుడై నిలచి బోధించు చున్నాడని పరమాత్మ తన్ను తా నావిష్కరించుకొనినాడు. తన వాసమగు సత్యమును చేరినచో మాయా ప్రభావమునకు లోబడుట యుండదని తెలుపు చున్నాడు. సర్వజీవులవలె అవరోహణం, ఆరోహణ క్రమములు పొందక యుండుటకు తన నివాసము చేరుమని బోధించు చున్నాడు. 🍀
అవ్యక్తో _ర ఇత్యుక్త సమాహు: పరమాం గతిమ్ |
యం ప్రాప్య న నివర్తంతే తధామ పరమం మమ || 21
తాత్పర్యము : ఏ సత్యము అగోచరమో, నాశరహితమో, సర్వోత్తమమో, దేనిని పొందినచో మరల సృష్టి సర్గమమున జనింప నావశ్యకత లేదో, ఆ పరమగు సత్యమే నా నివాస స్థానము. అట్టి సనాతనమగు సత్యము నీ యందు ఉపస్థితమై యుండునని తెలియుము.
వివరణము : ఈ సమస్త సృష్టికి ఆధారమగు సత్యమే తన శాశ్వత నివాసస్థానమని, అట్టి సత్యమే రూపు గట్టుకొని అర్జునుని ముందు నిలబడి యున్నదని, పరము, అక్షరము, బ్రహ్మము అగు తానే తన ప్రకృతిని కూడి ఉన్ముఖుడై నిలచి బోధించు చున్నాడని పరమాత్మ తన్ను తా నావిష్కరించుకొనినాడు. కనుకనే ఈ బోధన భగవద్బోధన. గీతాకృతి దాల్చిన ఈ బోధన ముమ్మాటికిని భగవద్గీతయే.
ఇతర గీతలన్నియు పరమును గూర్చి బోధించినవే అయినను, బ్రహ్మమును గూర్చి బోధించినవే అయినను, సాక్షాత్తు పరబ్రహ్మము బోధించిన సమయమిది యొక్కటియే. కనుకనే శ్రీ కృష్ణుని శ్రీకృష్ణ పరమాత్మ అని పిలుచుట సమంజసము.
అట్టి శ్రీకృష్ణుడు అవ్యక్తమునకు కూడ అవ్యక్తుడు. అతడక్షరుడు. సర్వోత్తముడు. అతని నివాసమే సత్యము. అతడే సనాతనుడు. అట్టి తన నివాసమును చేరుమని అత్యంత వాత్సల్యముతో, తన కిష్టుడగు అర్జునుని హెచ్చరించుచున్నాడు. తన వాసమగు సత్యమును చేరినచో మాయా ప్రభావమునకు లోబడుట యుండదని తెలుపుచున్నాడు. సర్వజీవులవలె అవరోహణం, ఆరోహణ క్రమములు పొందక యుండుటకు తన నివాసము చేరుమని బోధించు చున్నాడు.
పరంధామమును చేరిన జీవికి ఇక జనన మరణము లుండవు. మాయ స్పృశింపదు. దివ్య సంకల్పమున సృష్టి యందు ప్రవేశించినప్పటికి, ఎట్టి వికారములేక, మాయకు లోబడక దివ్య కార్యములు నిర్వర్తించి, మరల తన నివాసమే చేరును. సనక సనందనాదులు, నారదుడు, సప్త ఋషులు, ప్రజాపతులు, మనువులు అట్లు శాశ్వత పదము నందుండి భగవత్ శాసనముగ సృష్టియందు తమ కర్తవ్యములను నిర్వర్తించుచు నున్నారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
17 Aug 2021
No comments:
Post a Comment