🌹 . శ్రీ శివ మహా పురాణము - 440🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 28
🌻. శివుని సాక్షాత్కారము - 3 🌻
నీవు చెప్పిన తీరున చితాభస్మ అపవిత్రమైనచో, ఆయన శరీరమునుండి జారిన భస్మను దేవతలు నిత్యము శిరస్సుపై ధరించుటకు కారణమేమి? (21) ఏ దేవుడు సగుణుడై జగత్తులను సృష్టించి పోషించి సంహరించునో, నిర్గుణస్వరూపుడై శివనామధేయమును కలిగియుండునో, అట్టి దేవుడు ఎట్లు తెలియబడును? (22)
పరబ్రహ్మ పరమాత్మయగు శివుని నిర్గుణ స్వరూపమును నీ వంటి బహిర్ముఖులు ఎట్లు తెలియగల్గుదురు? (23) దురాచారపరులు, పాపప్రవృత్తి గలవారు, దేవతాగణమునుండి బహిష్కరింపబడినవారు నిర్గుణ స్వరూపుడగు శివుని తత్వమును ఎన్నటికీ తెలియజాలరు (24).
ఏ పురుషుడైతే తత్త్వము నెరుంగక శివుని నిందించునో, వానికి పూర్వజన్మల నుండియూ సంపాదించుకున్న పుణ్యము బూడిద యగును (25). మహాతేజస్వియగు శివుని నీవిచట నిందించితివి. అట్టి నిన్ను పూజించిన నాకు పాపము కలుగును (26). శివుని ద్వేషించువానిని చూచినచో కట్టుబట్టలతో స్నానము చేయవలెను (27). ఓరీ! దుష్టా! నాకు శంకరుడు ఎరుకయేనని నీవు చెప్పితివి. కాని సనాతనుడగు ఆ శివుడు నీచే నిశ్చయముగా తెలియబడలేదు (28).
రుద్రుడు ఎట్లైనూ ఉండుగాక! ఆయన వివిధ రూపములను ధరించుగాక! వికారరహితుడు, సత్పురుషులకు ప్రియుడునగు రుద్రుడు నాకు ఎల్లవేళలా మిక్కిలి ప్రియమైనవాడు (29). విష్ణువు, బ్రహ్మ కూడ ఏ కాలమునందైననూ ఆ మహాత్మునితో సరిదూగరు. కాలాధీనులగు ఇతర దేవతల గురించి చెప్పునదేమున్నది? (30)
ఈ సత్యమును సద్బుద్ధితో విచారించి తెలుసుకొని నేను శివుని పొందుటకొరకై అడవికి వచ్చి విస్తారమగు తపస్సును చేయుచున్నాను (31). ఆయనయే పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, భక్తవత్సలుడు, దీనులను అనుగ్రహించే ఆయనను పొందవలెననే అభిలాష నాకు గలదు (32).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
17 Aug 2021
No comments:
Post a Comment