🌹. గీతోపనిషత్తు -242 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚
శ్లోకము 22-1
🍀 21-1. 'ఓం సత్యం పరం ధీమహి' - పరము, సత్యము అగు తత్త్యమే విరాట్ పురుషునిగ, పరమ పురుషునిగ ఈ సమస్త జగత్తును వ్యాపించి యున్నది. అతనిని నిత్యము దర్శించు యత్నము సిద్ధించిననాడు అతనిని పొందవచ్చును. ఉన్నది పరమగు ఒకటే సత్యము. అదియే ఇదిగ ఏర్పడినది. దానికన్న వేరుగ ఏమియు లేదు. వేరుగ చూచుట మాని దానినే చూచుట నేర్వవలెను. అన్ని కాలము లందును అదియే నిండి యున్నది. అన్ని ప్రాణికోట్లుగను అదియే యున్నది. వేరొకటి లేదు. వేరొకటి చూచుట అజ్ఞానము. దానినే దర్శించుట జ్ఞానము. 🍀
పురుషః స పరః పార్థ భక్త్యా లభ్య వ్యనన్యయా |
యస్యాన్తః స్థాని భూతాని యేన సర్వ మిదం తతమ్ || 22
తాత్పర్యము : పరము, సత్యము అగు తత్త్యమే విరాట్ పురుషునిగ, పరమ పురుషునిగ ఈ సమస్త జగత్తును వ్యాపించి యున్నది. అతనిని నిత్యము దర్శించు యత్నము సిద్ధించిననాడు అతనిని పొందవచ్చును.
వివరణము : ఈ కనిపించుచున్న సమస్త సృష్టి, సర్వ ప్రాణి కోట్లగను ఉన్నది పరమగు ఒకటే సత్యము. అదియే ఇదిగ ఏర్పడినది. దానికన్న వేరుగ ఏమియు లేదు. వేరుగ చూచుట మాని దానినే చూచుట నేర్వవలెను. అన్ని కాలము లందును అదియే నిండి యున్నది. అన్ని దేశములయందు అదియే వ్యాప్తి చెంది యున్నది. అన్ని ప్రాణికోట్లుగను అదియే యున్నది. వేరొకటి లేదు. వేరొకటి చూచుట అజ్ఞానము. దానినే దర్శించుట జ్ఞానము.
అది రూపాంతరములు చెంది సృష్టిగ నేర్పడినను, వేరు వేరు గుణములు ప్రదర్శించు చున్నను మూలముగ అది లేనిచో గుణములు లేవు, రూపములు లేవు, నామములు అసలే లేవు. బంగారము లేక స్వర్ణాభరణము లుండునా! ఆభరణములుగ రూపాంతరము చెందినను, ఉన్నది బంగారమే. మంచుగడ్డ యందు, ఆవిరియందు ఉన్నది నీరే. మార్పు చెందుచున్న దాని యందు మారనిదిగ యున్నది సత్యము. అలయందు సముద్రమే సత్యము. అలకు సముద్రము లేక అస్థిత్వము లేదు కదా! సముద్రమే అలగ కూడ యున్నది. అల మార్పునకు గురియగును. సముద్రము సముద్రముగనే యుండును. అలయందు కూడ సముద్రముగనే యుండును.
ఆభరణము లందు బంగారము బంగారముగనే యుండును. మార్పు ఆభరణములకే గాని బంగారమునకు కాదు. రూపములకు, గుణములకు మార్పులుండును గాని మూలమునకు మార్పు యుండదు. మూల మెప్పుడు మూలముగనే యుండును. చోటులో ఎన్ని కట్టడములు కట్టినను, కట్టడములలోని చోటు చోటుగనే యుండును. చోటుకు మార్పుండదు. ఈ భూమి ఉన్నను లేకున్నను కూడ చోటు యుండును. చోటులో ఎన్నేర్పడినను చోటు చోటుగనే యుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
19 Aug 2021
No comments:
Post a Comment