మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 70


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 70 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. ఆనందసూక్తము - 2 🌻

మనము ఆనందమనుకొనేది‌ కేవలము ఆనందమును‌ గూర్చిన భావనయేకాని, నిజమైన ఆనందము కాదు. మనలో ప్రతివారు ఆనందమును‌ గూర్చిన తమ‌ స్వీయభావనలో మితిమీరి వర్తించుటలో తృప్తిని బడయుదురు. దానితో పొరలు క్రమ్మి, దానినే ఆనందమని పిలుస్తాము.

కావున‌ మనం ఆనందమనుకొన్న దానిలో ఎంతో సమయాన్ని వ్యయపరచి, ఆనందంగా ఉన్నామని‌ నమ్ముట ద్వారా మనల్ని‌ మనం మోసం చేసుకోవటం, పైగా కాలాన్ని వృథా చేయటమని పరమగురువులు, ఆచార్యులు భావిస్తారు.

ఆనంద భావన‌ నుండి, పరిపూర్ణానందంలోనికి‌ ప్రవేశించడానికి యత్నం చేద్దాము. అయితే దీనికి పరీక్ష ఏమిటి? నాకేది ఆనందాన్నిస్తుందో అది నీకు ఆనందము కాదు, కాకపోవచ్చును.

రెండు గడియారాలు ఒకే సమయాన్ని సూచించవన్నట్లుగా, ఆనందాన్ని గూర్చిన ఏ రెండు భావనలూ ‌ఒకే రీతిగా ఉండవు. ఆనందమనేది వ్యక్తగత భావనగా అభిప్రాయంగా ఉన్నంతకాలం అది ఆనందమనటానికి వీలు లేదు.

నేను ఫలానాది ఆనందమని‌ భావిస్తే, నీవు మరొకటి ఆనందమని నమ్ముతావు. అంటే అర్థం, ఊహాలోకంలో ఆనందాన్ని గూర్చి భావనలో ఇద్దరం జీవిస్తున్నామన్నమాట. అంతేకాదు దానినే ఆనందమని మనం ఆనందంతో అంటూ ఉంటాము.

శరీరమనే వాహికలో ఎన్నో పరికరాలున్నాయి. అది అత్యంత అధునాతనమైన కొన్ని వందల పొరలున్న వాహిక. ఆ పొరల కట్టనే మనం 'మనస్సు' అని అంటున్నాము.

......✍️ మాస్టర్ ఇ.కె.

🌹 🌹 🌹 🌹 🌹


19 Aug 2021

No comments:

Post a Comment