శ్రీ శివ మహా పురాణము - 441
🌹 . శ్రీ శివ మహా పురాణము - 441🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 28
🌻. శివుని సాక్షాత్కారము - 4 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ మహర్షీ! ఆ పర్వత రాజపుత్రిక ఇట్లు పలికి మిన్నకుండి, వికారములేని మనస్సుతో శివుని ధ్యానించెను (33). దేవి యొక్క ఆ మాటలను విని ఆ బ్రాహ్మణ బ్రహ్మచారి మరల ఏదో చెప్పుటకు సిద్ధపడెను (34).
కాని ఇంతలో, శివుని యందు లగ్నమైన మనోవృత్తులు గలది, శివనిందను సహింపలేనిది అగు పార్వతి వెంటనే తన చెలికత్తెయగు విజయతో నిట్లనెను (35).
పార్వతి ఇట్లు పలికెను-
ఓ సఖీ! ఈ బ్రాహ్మణాధము డింకనూ ఏదో చెప్పగోరుచున్నాడు. మరల శివుని నిందించగలడు. కావున ఈతనిని ప్రయత్న పూర్వకముగనైననూ నిలుపు జేయవలెను (36). శివుని నిందించువానికి మాత్రమే గాక ఆ నిందను వినువానికి కూడ పాపము చుట్టకొనును (37). శివభక్తులు శివనిందచేయువానిని ఎట్లైననూ వధించవలెను. ఆతడు బ్రాహ్మణుడైనచో విడిచిపెట్టవలెను. అచ్చోట నుండి వెంటనే తొలగిపోవలెను (38).
ఈ దుష్టుడు మరల శివుని నిందించగలడు. బ్రాహ్మణుడు గనుక ఈతడు వధార్హుడు కాడు. కాన ఈతనిని విడిచి పోవలెను. ఎట్టి పరిస్థితులలోనైననూ ఈతనిని చూడరాదు (39). మనమీ స్థలమును విడిచి ఈ క్షణమునందే మరియొక చోటికి శీఘ్రముగా పోదము. అట్లు చేయుట వలన ఈ మూర్ఖునితో మరల సంభాషించుట తప్పిపోవును (40).
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఓ మహర్షీ! ప్రియురాలగు ఉమాదేవి ఇట్లు పలికి వెళ్లుటకు ముందుడుగు వేయనంతలో ఆ శివుడు స్వస్వరూపముతో ప్రత్యక్షమై ఆమెను పట్టుకొనెను (41). ఉమాదేవి శివుని ఏ సగుణ రూపమును ధ్యానించెడిదో, అదే రూపమును ఆమెకు దర్శింపజేసి శివుడు తలవంచుకొనియున్న ఆమెతో నిట్లనెను (42).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
19 Aug 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment