గీతోపనిషత్తు -264


🌹. గీతోపనిషత్తు -264 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚

శ్లోకము 7-1


🍀 7. ఈశ్వర ప్రణిధానము -1 - పరమాత్మ తానుగ ఎల్లప్పుడును ఉన్నవాడు. అతని సహజ లక్షణము శాశ్వతమగు ఉనికి. తన నుండి ఉద్భవించు ప్రకృతియే సమస్తమును నిర్వహించు చుండును. తన నుండి బలము గొని, అనేకానేక విధములుగ సృష్టి నిర్మాణము చేయును. ప్రాణికోట్లు పుట్టుట, పెరుగుట, పోషింప బడుట, వృద్ధి చెందుట, తిరోగ మించుట, తనలోనికి కలిసిపోవుట ఇత్యాది కృత్యములన్నియు ప్రకృతి చేష్టలే. సమస్త సృష్టికిని కర్తృత్వము ప్రకృతిదే అని, తాను కర్త కాదని తెలుపుచున్నాడు. 🍀

సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికామ్ |
కల్పయే పున స్తాని కల్పాదౌ విస్పజా మ్యహమ్ II 7

తాత్పర్యము : ప్రళయ కాలమున ప్రాణికోట్లన్నియు నా ప్రకృతిని చేరును. నా ప్రకృతి నన్నుచేరి హృదయమున నుండును. మరల నా ప్రకృతి నా హృదయమునుండి వెలువడి ప్రాణికోట్లను వెలువరించును.

వివరణము : ఇచ్చట దైవము స్వతః సిద్ధమగు తన స్థితిని ఆవిష్కరించు చున్నాడు. సమస్త సృష్టికిని కర్తృత్వము ప్రకృతిదే అని, తాను కర్త కాదని తెలుపుచున్నాడు. తాను కర్తృత్వమునకు ఆవల శాశ్వతుడుగ ఎట్టి స్థితి మార్పులు లేక అక్షరముగ నుండు బ్రహ్మమని, తన నుండి ఏర్పడిన ప్రకృతియే ఇచ్ఛా జ్ఞాన క్రియలుగ రూపాంతరము చెంది, సమస్తమును సృష్టించి, పెంచి, పోషించి మరల వెనుకకు తిరోగమనము చెంది తనను చేరుచున్నదని, తాను కేవలము ప్రకృతికాధారముగ నున్న వాడేకాని, తానేమియు చేయుట లేదని తెలుపుచున్నాడు.

పరమాత్మ తానుగ ఎల్లప్పుడును ఉన్నవాడు. అతని సహజ లక్షణము శాశ్వతమగు ఉనికి. తననుండి ఉద్భవించు ప్రకృతియే సమస్తమును నిర్వహించుచుండును. తన నుండి బలముగొని, అనేకానేక విధములుగ సృష్టి నిర్మాణము చేయును. ప్రాణికోట్లు పుట్టుట, పెరుగుట, పోషింప బడుట, వృద్ధి చెందుట, తిరోగ మించుట, తనలోనికి కలిసిపోవుట ఇత్యాది కృత్యములన్నియు ప్రకృతి చేష్టలే.

ప్రాణికోట్లన్నిటికిని ప్రకృతియే మూలము. ప్రకృతికి తాను మూలము. తన నుండి పుట్టిన ప్రకృతినుండి పుట్టిన ప్రాణి కోట్లకు ప్రకృతియే స్వామి. ప్రకృతికి తాను స్వామి. తాను ప్రకృతికి ఆవలివాడు. జీవులు ప్రకృతికి ఈవలివారు. జీవులు ప్రకృతికి లోబడి యుందురు. తాను ప్రకృతికి మూలమగుటచే ప్రకృతికి లోబడి యుండు వాడు కాదు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


21 Oct 2021

No comments:

Post a Comment