శ్రీ శివ మహా పురాణము - 463
🌹 . శ్రీ శివ మహా పురాణము - 463🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 33
🌻. సప్తర్షుల ఉపదేశము - 1 🌻
ఋషులిట్లు పలికిరి -
శివుడు జగములకు తండ్రి అనియు, శివాదేవి తల్లి అనియు పెద్దలు చెప్పెదరు. కావున నీవు కన్యను మహాత్ముడగు శంకరునకిమ్ము (1). ఓ హిమగిరీ! ఇట్లు చేసినచో నీ జన్మ సార్థకమగును. నీవు జగద్గురువునకు గురువు కాగలవు. సందేహము లేదు (2).
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఓ మహర్షీ! హిమవంతుడు సప్తర్షుల ఈ మాటలను విని వారికి చేతులు జోడించి నమస్కరించి ఇట్లు పలికెను (3).
హివమంతుడిట్లు పలికెను-
మహాత్ములారా! సప్తర్షులారా! శివుని ఆజ్ఞచే మీరు చెప్పిన మాట పూర్వమే నాచేత ప్రమాణముగా స్వీకరింపబడినది (4). ఇప్పుడే ఒక వైష్ణవధర్మానుయాయి అగు బ్రాహ్మణుడు వచ్చి శివుని ఉద్దేశించి విపరీతమగు మాటలను మహాప్రీతితో పలికినాడు (5). అప్పటి నుండియూ పార్వతి తల్లి జ్ఞానభ్రష్టురాలై యోగియగు రుద్రునితో పార్వతి యొక్క వివాహమునకు అంగీకరించుట లేదు (6).
ఆమె మిక్కలి దుఃఖితురాలై మాసిన వస్త్రములను ధరించి కోపగృహములో ప్రవేశించినది. ఓ ఋషులారా! బోధించిననూ ఆమె తెలుసు కొనుట లేదు. ఆమె చాల మొండి పట్టుతో నున్నది (7). నేను కూడ జ్ఞానము కోల్పోతిని. నేను సత్యమునే పలుకుచున్నాను.
భిక్షరూపధారియగు మహేశ్వరునకు కుమార్తెను ఇచ్చుట నాకు ఇచ్చగించుట లేదు (8).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ మహర్షీ! శివమాయచే విమోహితుడైన పర్వతరాజు మునుల యెదుట నిలబడి ఇట్లు పలికి మిన్నకుండెను (9). ఆ ఏడ్గురు ఋషులు శివమాయను కొనియాడి, పిదప అరుంధతిని మేనక వద్దకు పంపిరి (10). జ్ఞానమును ఇచ్చే ఆ అరుంధతి భర్త ఆజ్ఞను గైకొని, వెంటనే పార్వతి మరియు మేన ఉన్నచోటకు వెళ్లెను (11). ఆమె అచటకు వెళ్లి శోకముచే పరాభూతయై పరుండియున్న మేనను చూచెను. అపుడా సాధ్వి మెల్లగా మధురము, హితమునగు వచనము నిట్లు పలికెను (12).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
21 Oct 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment