గీతోపనిషత్తు -278



🌹. గీతోపనిషత్తు -278 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚

శ్లోకము 13-2

🍀 13-2. ఈశ్వర తత్వము - కర్తవ్యము నందు నిమగ్నమై యున్న వానికి అహింస, సత్యము ఆదిగాగల సద్గుణముల యందు ఆసక్తి కలుగును. వాటి నిర్వహణము వలన లోపల బయట శుచి, శౌచము పెరుగగ, పంచ భూతములకు, గుణములకు ఆధారమైన చేతస్సు దర్శనమగు చుండును. జీవుల చేష్టల యందు నిత్యము కదులుచున్న చైతన్యము కనిపించును. అట్టి కదిలెడి చైతన్యములకు ఆధారముగ అందరి యందును నిశ్చల చైతన్యము ఉన్నదని గోచరించును. ఆ చైతన్యము అవ్యయమని తెలుయును. అనగా దానికి తరుగుట, పెరుగుట అను స్థితులు లేక ఎప్పుడును ఉండుటగ గోచరించును. 🍀

మహాత్మానసు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రితాః |
భజం త్యనన్యమనసో జ్ఞాత్వా భూతాది మవ్యయమ్ || 13

తాత్పర్యము : దైవీ ప్రకృతి నాశ్రయించి మహాత్ములు సమస్త ప్రాణికోటికి ఆదికారణునిగను, నాశ రహితునిగను నన్నెరిగి ఇతర చింతన లేక నన్నే సేవించు చున్నారు.

వివరణము : నిత్యము కార్యం కర్మ యందు అనగా తన కర్తవ్యము నందు నిమగ్నమై యున్న వానికి అహింస, సత్యము ఆదిగాగల సద్గుణముల యందు ఆసక్తి కలుగును. క్రమముగ వాని నిర్వహణము నందు రుచి పెరుగును. మలినములు కరుగును. లోపల బయట శుచి, శౌచము పెరుగగ, పంచ భూతములకు, గుణములకు ఆధారమైన చేతస్సు దర్శనమగు చుండును. అందరి చేష్టలకు వెనుక ఒకే ఒక నిశ్చల చైతన్యము యున్నదని, అది నిత్యము, శాశ్వతము అగు వెలుగని, అది కదలని చైతన్యమని, అది ఆధారముగ కదిలెడి చైతన్య రూపములు అనేకానేక విధము లుగ కదులుచున్నవని తెలుయును.

జీవుల చేష్టల యందు నిత్యము కదులుచున్న చైతన్యము కనిపించును. అట్టి కదిలెడి చైతన్యములకు ఆధారముగ అందరి యందును నిశ్చల చైతన్యము ఉన్నదని గోచరించును. ఆ చైతన్యము అవ్యయమని తెలుయును. అనగా దానికి తరుగుట, పెరుగుట అను స్థితులు లేక ఎప్పుడును ఉండుటగ గోచరించును. అది ఆధారముగనే జీవులకు జాగ్రత్-స్వప్న సుషుప్తి అవస్థలు కలుగుచున్నవని తెలియును. అది వెండితెరవలె, ఆకాశము వలె అంతట వ్యాప్తి చెంది యుండగ, అది ఆధారముగ అనేకములగు జీవుల చేష్టలు జరుగుచున్నట్లు గోచరించును. వెండితెర నిశ్చలముగ నున్నపుడు దానిపై జరుగుచున్న బొమ్మలకథ అనేకమగు చేష్టలతో, వైవిధ్యముతో కూడిన చేష్టలతో జరుగుచుండును. అట్టి బొమ్మ చేష్టలకు ఆధారము వెండితెరయే.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


19 Nov 2021

No comments:

Post a Comment