నిర్మల ధ్యానాలు - ఓషో - 112
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 112 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. సాధారణంగా వ్యక్తి ఉనికిని చుట్టుముట్టిన సౌందర్యం పట్ల స్పృహతో వుండడు. కేవలం వికారం పట్ల స్పృహతో వుంటాడు. కారణం మనసెపుడూ మరిచిపోతుంది. గాయాల్ని లెక్క పెడుతుంది. దీవెనల్ని విస్మరిస్తుంది. మనసు మార్గం అలాంటిది. 🍀
ధ్యానం నీ కోసం రెండు పనులు చేస్తుంది. నీ చుట్టూ వున్న సౌందర్యం పట్ల నీకు స్పృహ కలిగిస్తుంది. దాని పట్ల నువ్వు సున్నితంగా స్పందించేట్లు చేస్తుంది. రెండోది నిన్ను సౌందర్యభరితం చేస్తుంది. నీలో ఒక దయాతరంగాన్ని లేపుతుంది. నీ కళ్ళు ఎంతగా దయతో నిండి వుంటాయంటే సమస్త అస్తిత్వం సౌందర్యంతో నిండిపోతుంది. మనం సౌందర్యం నిండిన అస్తిత్వం నించీ దోసిళ్ళతో దాన్ని తాగాలి. మనలోకి ఆ సౌందర్యం ప్రవేశించడానికి మనం అనుమతించాలి. సాధారణంగా వ్యక్తి ఉనికిని చుట్టుముట్టిన సౌందర్యం పట్ల స్పృహతో వుండడు. కేవలం వికారం పట్ల స్పృహతో వుంటాడు. కారణం మనసెపుడూ మరిచిపోతుంది. గాయాల్ని లెక్కపెడుతుంది. దీవెనల్ని విస్మరిస్తుంది. మనసు మార్గం అలాంటిది.
నువ్వు ధ్యానంలోకి అడుగుపెట్టిన క్షణం, నువ్వు నిశ్శబ్దంలోకి అడుగుపెట్టిన క్షణం మరింత విశ్రాంతి పొందుతావు. మరింతగా నీ అస్తిత్వంలో స్థిరపడతావు. అప్పుడు నువ్వు హఠాత్తుగా వృక్షాల సౌందర్యం పట్ల, మేఘాల అందం పట్ల, మనుషుల సౌందర్యం పట్ల స్పృహతో వుంటావు. ప్రతిదీ సౌందర్యభరితమే. కారణం ప్రతిదీ దైవత్వంతో నిండివుంది. బండలు కూడా దైవత్వాన్ని నింపుకొని వున్నాయి. దైవత్వం లేనిదేదీ లేదు. ఒకసారి నువ్వు ఈ సౌంధర్య కోణాల్ని అనుభూతి చెందడం ఆరంభిస్తే నువ్వు సంగీతంతో, కవిత్వంతో, నాట్యంతో, ఉత్సవంతో ప్రేమతో నిండిపోతావు. నువ్వు అందంతో నిండిపోతావు. ధగధగలాడతావు. అది నీలో ప్రతి ఒక్కరికీ కనబడుతుంది. ఒకరు ఆ సౌందర్యాన్ని నీలో చూడాలనుకుంటే అది కనిపిస్తుంది. కానీ జనం కళ్ళు మూసుకుని వుంటారు. అందువల్ల చూడలేరు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
20 Dec 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment