మైత్రేయ మహర్షి బోధనలు - 45


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 45 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 33. నిరాదరణ 🌻

సమస్త సృష్టియు పరంపరాగతముగ లోకములను, లోకేశులను, లోకస్థులను ఏర్పరచుకొని యున్నది. సృష్టికి మూలసూత్రమే పరంపర. నారాయణుని నుండి చతుర్ముఖుడు, చతుర్ముఖుని నుండి సమస్త లోకములు ఉద్భవించుట తెలిసిన విషయమే. సృష్టి యందు ఊర్ధ్వలోకములు, అధోలోకములకు ఆధారము. క్రింది లోకముల వారు పైలోకముల వారిని గౌరవించుట, పూజించుట, మన్నించుట సృష్టి యందు సహజ ధర్మము. సమస్త సృష్టి ధర్మములు అవ్యక్తము నుండి సూక్ష్మ లోకములలోనికి, అచటి నుండి స్థూల లోకములలోనికి అవ తరణము చెందు చున్నవి. సృష్టి యందు ఊర్ధ్వలోకముల వారు అధో లోకముల వారిని ఆదరించుట వలననూ, అధోలోకముల వారు ఊర్ధ్వలోకముల వారిని మన్నించుట వలననూ సృష్టికార్యము నిరాటంకముగ సాగుచుండును.

ఈ పరంపరాగత ధర్మములు మానవులకు కూడా లభించినవి. తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను పిన్నలు గౌరవించుట, పిన్నలను పెద్దలు ఆదరించుట ఈ ధర్మస్వరూపమే. ఏ సంఘముననై ననూ యీ సూత్రము చెడినచో, ఆ సంఘము పతనము చెందుట ఖాయము. పతనము చెందిన మానవ సంఘములకు ప్రేమతో, ఆదరముతో, మరల యీ ధర్మ సూత్రములను బోధించుట, అందించుట- తత్ఫలితముగ మానవ జాతికి తోడ్పడుట మా గురుపరంపర యొక్క కార్యక్రమము. గురువులను నిరాకరించిన సాంప్రదాయమున సృజనాత్మక శక్తి నశించగలదు. సృజనాత్మక శక్తి నశించిన జాతికి పురోగతి లేదు.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


20 Dec 2021

No comments:

Post a Comment