గీతోపనిషత్తు -290
🌹. గీతోపనిషత్తు -290 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚
శ్లోకము 17-1
🍀 17-1. ప్రణవ స్వరూపుడు - ఈ జగత్తు పుట్టించిన సృష్టికర్త యందు నేనే యున్నాను. అట్లే నిన్ను పుట్టించిన నీ తండ్రి యందు నీ నేనే యున్నాను. నిన్ను ధరించి, భరించిన తల్లి యందు కూడ నేనే యున్నాను. సాధకుని యందు ఇది స్థిరపడవలెను. ఇట్లు స్థిరపడక ఎన్ని తెలిసినను ఒకటే. అజ్ఞానము మిగులును. ఏమి చూచినను, ఏమి విన్నను, ఏమి స్పృశించినను, ఏమి రుచి చూచినను, ఏమి వాసన చూచినను, ఏమి భావించినను, ఏ గ్రంథమందలి విజ్ఞానమైనను, ఏ శాస్త్రమైనను, అన్నిటి యందు తెలియవలసినది ఈశ్వరుడే. ఇంతకన్న ఏమి చెప్పవలెను. 🍀
పితా హమస్య జగతో మాతా ధాతా పితామహః |
వేద్యం పవిత్ర మోంకార ఋక్సామ యజురేవ చ || 17
తాత్పర్యము : ఈ జగత్తునకు తండ్రిని నేనే. తల్లి, తండ్రి, తాత కూడ నేనే. ఓంకారము నేనే. అన్నిటి యందు తెలిసికొనదగినది నేనే. పవిత్ర పదార్థముగ నున్నది నేనే. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము నేనే.
వివరణము : అన్నియు నేనే. అంతయు నేనే అని తెలిపిన దైవము ముందు తెలిపిన ఉదాహరణలకు తోడుగ మరికొన్ని ఉదాహరణలు తెలుపుచున్నాడు. ఈ జగత్తు పుట్టించిన సృష్టికర్త యందు నేనే యున్నాను. అట్లే నిన్ను పుట్టించిన నీ తండ్రి యందు నీ నేనే యున్నాను. నిన్ను ధరించి, భరించిన తల్లి యందు కూడ నేనే యున్నాను. నీ తల్లిని తండ్రిని పుట్టించిన పితామహుడు, నీ మాతామహుల యందు కూడ నేనే యున్నాను. అందు బంధుత్వమున వీరు ముఖ్యులు కనుక వీరిని ఉదాహరణముగ తెలిపినాడు.
అట్లే ఇతర బంధువులు, మిత్రులు, జనులు, జంతువులు అన్నిటియందు తానే యున్నాడని తెలియవలెను. శత్రువు రూపమున కూడ మూలమున తానే యున్నాడు. భార్య, సంతతి ఎన్ని సంబంధము లున్నవో అన్నియు తానే. సాధకుని యందు ఇది స్థిరపడవలెను. ఇట్లు స్థిరపడక ఎన్ని తెలిసినను ఒకటే. అజ్ఞానము మిగులును.
ఏమి చూచినను, ఏమి విన్నను, ఏమి స్పృశించినను, ఏమి రుచి చూచినను, ఏమి వాసన చూచినను, ఏమి భావించినను, ఏ గ్రంథమందలి విజ్ఞానమైనను, ఏ శాస్త్రమైనను, అన్నిటి యందు తెలియవలసినది ఈశ్వరుడే. ఇంతకన్న ఏమి చెప్పవలెను. అయినను తెలియజెప్పు చున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
13 Dec 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment