శ్రీ శివ మహా పురాణము - 488
🌹 . శ్రీ శివ మహా పురాణము - 488 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 38
🌻. వివాహ మండపము - 2 🌻
కొన్నిచోట్ల కృత్రిమ స్త్రీలు కృత్రిమ పురుషులతో కలిసి నృత్యము చేయుచుండగా ఎందరో కృత్రిమ ప్రేక్షకులు పరవశులై తిలకించుచుండిరి (12).మరియు సుందరాకారులగు ద్వారపాలకులు చేతులతో ధనస్సులను ఎక్కుపెట్టి యుండిరి. అవి బొమ్మలే యైననూ ప్రాణము గలవి యన్నట్లుండెను (13). అద్భుతమగు మహాలక్ష్మీ విగ్రహము ద్వారమునందు నిర్మింపబడెను. సర్వలక్షణములతో విలసిల్లు ఆ విగ్రహము క్షీరసముద్రము నుండి ఆవిర్భవించిన లక్ష్మీదేవియా అన్నట్లుండెను (14). అలంకరింపబడిన కృత్రిమ గజములు యధార్థమగు ఏనుగులను పోలియుండెను. గుర్రములు రౌతులతో, గజములు మావటీండ్రతో కూడి యుండెను (15).
కృత్రిమమగు రథములను కృత్రిమసారథులు తోలుచుండిరి. ఇతర వాహనములు కూడ అటులనే అమర్చబడినవి. మరియు కృత్రిమమగు సైనిక దళములు కూడ ఉండెను. ఈ దృశ్యములన్నియూ మహాశ్చర్యమును కలిగించుచుండెను (16). ఓ మునీ! దేవతలను, మునులను మోహింపజేయుటకై విశ్వకర్మ ఉత్సాహముతో ఇట్టి దృశ్యములను నిర్మించెను (17).
ఓ మహర్షీ! మహాద్వారమునందు ఒక కృత్రిమ నంది నిలబడియుండెను. స్వచ్ఛమగు స్ఫటికము వలె వెలుగొందు ఆ బొమ్మ యథార్థమగు నందివలెనే యుండెను (18). ఆ ద్వారమునకు పైన రత్నములతో, స్వచ్ఛమగు చిగుళ్లతో, మరియు పుష్పములతో అలంకరింపబడిన గొప్ప దివ్యమైన రత్నములతో ప్రకాశించే కృత్రిమ పుష్పక విమానము దేవతలతో గూడి మిక్కిలి శోభిల్లెను (19).
ఎడమవైపు శుద్ధ కాషాయ వర్ణము గల రెండు ఏనుగులు నిర్మింపబడెను. నాల్గు దంతములతో గొప్పగా ప్రకాశించు ఆ ఏనుగులు అరువది సంవత్సరములు వయసు గలవా యున్నట్లు భాసించెను. అవి పరస్పరము స్పృశించుచున్నట్లు భాసించెను (20). మరియు విశ్వకర్మ సూర్యుని వలె ప్రకాశించు రెండు గుర్రములను నిర్మించెను. చామరములచే, మరియు దివ్యాభరణములచే అలంకరింపబడిన ఆ దివ్యాశ్వములు గొప్పగా ప్రకాశించెను (21).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
13 Dec 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment