గీతోపనిషత్తు -291
🌹. గీతోపనిషత్తు -291🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚
శ్లోకము 17-2
🍀 17-2. ప్రణవ స్వరూపుడు - ఏ వస్తువు నందు ఈశ్వరుని దర్శింతురో ఆ వస్తువు పవిత్రమని తెలుయుట జ్ఞానము. పవిత్రమగు వస్తువుల యందు కూడ ఈశ్వర దర్శనము కానపుడు వాని పవిత్రత అంతంత మాత్రమే. ఈశ్వరుని దర్శింపక ఇతరములన్నియు దర్శించుట దౌర్భాగ్యము. సమస్త సృష్టి ఈశ్వర నిర్మితమగుటచే, సమస్తము పవిత్రమే అని తెలుయుట రాజవిద్య. 🍀
పితా హమస్య జగతో మాతా ధాతా పితామహః |
వేద్యం పవిత్ర మోంకార ఋక్సామ యజురేవ చ || 17
తాత్పర్యము : ఈ జగత్తునకు తండ్రిని నేనే. తల్లి, తండ్రి, తాత కూడ నేనే. ఓంకారము నేనే. అన్నిటి యందు తెలిసికొనదగినది నేనే. పవిత్ర పదార్థముగ నున్నది నేనే. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము నేనే.
వివరణము : పవిత్రమగు వస్తువులను ఆదరించుట చేతురు గాని, అందలి ఈశ్వరుని చూడరు. కుంకుమ, పసుపు, గంధము, అక్షతలు, సాంబ్రాణి, దీపము, పంచపాత్ర, హరివేణము, ఉద్ధరిణ- ఇట్లనేక పవిత్ర వస్తువులను వాడుచు నుందుము. ఎందుకు పవిత్రమని అడిగినచో, శుభము కలిగించునని సమాధానము చెప్పెదము. శుభమెందులకు కలిగించును? అని ప్రశ్నించినచో, పెద్దలు చెప్పిరి అందుము. నిజమునకు అందీశ్వర సాన్నిధ్యము ప్రస్ఫుటముగ నుండును.
ఈశ్వరుని దర్శింపక ఇతరములన్నియు దర్శించుట దౌర్భాగ్యము. ఏ వస్తువు నందు ఈశ్వరుని దర్శింతురో ఆ వస్తువు పవిత్రమని తెలుయుట జ్ఞానము. పవిత్రమగు వస్తువుల యందు కూడ ఈశ్వర దర్శనము కానపుడు వాని పవిత్రత అంతంత మాత్రమే. సమస్త సృష్టి ఈశ్వర నిర్మితమగుటచే, సమస్తము పవిత్రమే అని తెలుయుట రాజవిద్య.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
15 Dec 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment