శ్రీ శివ మహా పురాణము - 490
🌹 . శ్రీ శివ మహా పురాణము - 490 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 38
🌻. వివాహ మండపము - 4 🌻
అదే విధముగా విష్ణువుకొరకై మహాప్రకాశము గలది, దివ్యమైనది, అనేకములగు ఆశ్చర్యములతో గూడినది అగు అపర వైకుంఠము నాతడు క్షణములో నిర్మించెను (32). మరియు ఆ విశ్వకర్మ అద్భుతము, ఉత్తమము, దివ్యము, సర్వసంపదలతో విలసిల్లునది అగు గృహమును ఇంద్రుని కొరకు నిర్మించెను (33). అదే విధముగా ఆతడు లోకపాలుర కొరకు సుందరమైనవి, దివ్యమైనవి, అద్భుతమైనవి, పెద్దవి అగు గృహములను సంతోషముతో నిర్మించెను (34). అతడు ఇతర దేవతలందరికీ కూడా విచిత్రములగు గృహములను వరుసగా నిర్మించెను (35).
శివుని నుండి గొప్ప వరములను పొందినవాడు, మహాబుద్ధిశాలి అగు విశ్వకర్మ శివునకు పూర్తిగా సంతోషమును కలిగించుట కొరకై క్షణములో గృహమును నిర్మించెను (36). చిత్రమైనది, గొప్పగా ప్రకాశించునది, దేవతలచే పూజింపబడునది, శివుని చిహ్నములు గలది, శివలోక హర్మ్యమును పోలియున్నది, మిక్కిలి సుందరమైనది అగు గృహమును ఆతడు శివుని కొరకు నిర్మించెను (37). ఈ విధముగా విశ్వకర్మ శివుని ప్రీతికొరకై విచిత్రము, అత్యాశ్చర్యకరము, గొప్ప ప్రకాశము గలది అగు రచనను ప్రదర్శించెను (38).
ఈ విధమగు లౌకిక వ్యవహారమునంతనూ పూర్తి చేసుకొని, ఆ హిమవంతుడు ఆనందముతో శంభుని రాకను నిరీక్షించుచుండెను (39). ఓ దేవర్షీ! ఈ తీరున నీకు హిమవంతుని ఆనందదాయకమగు చరిత్రనంతనూ చెప్పియుంటిని. ఇంకనూ ఏమి వినగోరుచున్నావు? (46)
శ్రీ శివ మహాపురాణములో రుద్రసంహిత యందలి పార్వతీఖండములో ముప్పది ఎనిమిదవ అద్యాయము వివాహమండప వర్ణనమను పేరు గలది ముగిసినది (38).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
15 Dec 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment