🌹 . శ్రీ శివ మహా పురాణము - 494 🌹


*🌹 . శ్రీ శివ మహా పురాణము - 494 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 39

*🌻. శివుని యాత్ర - 4 🌻*

అందరు ఇట్లు పలికిరి-

మహాదేవా! మహేశ్వరా! పార్వతీ మహాదేవిని వివాహమాడుట కొరకై మాతో గూడి శీఘ్రమే బయలు దేరుము. దయను చూపుము (44). అపుడు జ్ఞానముచే సంతుష్టమైన మనస్సు గల విష్ణువు భక్తితో శంకరునకు నమస్కరించి సందర్భమునకు అనురూపమగు మాటలను ఇట్లు పలికెను (45).

విష్ణువు ఇట్లు పలికెను-

దేవ దేవా! మహాదేవా! శరణు జొచ్చిన వారిపై నీకు ప్రీతి మెండు. నీవు నీ భక్తుల కార్యములను చక్కబెట్టెదవు. ఓ ప్రభూ! నావిన్నపమును వినుము (46). శంభో! శంకరా! నీవు పార్వతీ దేవిని గృహ్యసూత్రములలో చెప్పబడిన విధానములో వివాహమాడదగుదువు (47). హే హరా! నీవు వివాహవిధిని పాటించినచో, లోకము నందు ఆ విధి అంతటా ఖ్యాతిని పొందగలదు (48). ఓ నాథా! వారి కులధర్మమునను సరించి మండప స్థాపనమును, నాందీముఖమును ప్రీతి పూర్వకముగా అనుష్ఠించి, లోకములో నీ కీర్తిని విస్తరింపజేయుము (49).

బ్రహ్మ ఇట్లు పలికెను-

విష్ణువు ఇట్లు పలుకగా, లోకాచారమునందు శ్రద్ధ గల శంభుపరమేశ్వరుడు ఆ కర్మలను యథావిధిగా చేసెను (50). ఆయనచే నియోగింపబడని నేను మునులతో గూడి అచట అభ్యుదయమునకు తగిన ఆ కర్మలను అన్నింటినీ ప్రీతితో ఆదరముతో చేసితిని (51). ఓ మహర్షీ! కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, గౌతముడు, భాగురి, గురుడు, కణ్వుడు, బృహస్పతి, శక్తి, జమదగ్ని పరాశరుడు (52), మార్కండేయుడు, శిలాపాకుడు, అరుణపాలుడు, అకృతశ్రముడు, అగస్త్యుడు, చ్యవనుడు, గర్గుడు, మరియు శిలాదుడు అచటకు విచ్చేసిరి (53).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

No comments:

Post a Comment