గీతోపనిషత్తు -305
🌹. గీతోపనిషత్తు -305 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 20 - 2 📚
🍀 20-2. కోరికలు - ఆరాధకులు వారి స్వభావమును బట్టి అనేకానేకమగు కోరికలతో దైవమును ప్రార్ధించుచు నుందురు. అసురు లొక రకముగ కోరుచుందురు. దేవతలు మరొక రకముగ కోరుచుందురు. భోగభాగ్యములు, కీర్తిని, ఆరోగ్యమును, ఆయుషును, బలమును, వీర్యమును, విద్యను, వంశాభివృద్ధిని, రక్షణమును- ఇట్లెన్నియో విషయములను అన్ని సంప్రదాయముల వారును ఏదో ఒక విధముగ కోరుచునే యుందురు. 🍀
త్రైవిద్యా మాం సోమపా: పూతపాపా యథైరిష్ట్యా స్వర్గతిం ప్రార్థయంతే |
పుణ్యమాసాద్య సురేంద్రలోక మశ్నంతి దివ్యానివి దేవభోగాన్ || 20
తాత్పర్యము : స్వర్గప్రాప్తిని వేడుకొనుచు, మూడు వేదము లధ్యయనము చేయువారు, సోమపానము కొరకై సోమయజ్ఞము చేసినవారు, పుణ్యకర్మలు చేసినవారు, పై విధముగ నన్ను పూజించినవారు సురేంద్ర లోకమును చేరి, దివ్యమగు భోగములను అనుభవించు చున్నారు.
వివరణము : ఎప్పుడు, ఏ సమయమున, ఎవరికి ఏది తీరని లోటని పించునో, దానిని కోరుట సృష్టి సహజము. కోరినవారి కోరిక యందలి బలము, ఆ కోరికను తీర్చుకొను ప్రయత్నము నందలి బలమును బట్టి, కాలానుసారము కోర్కెలు తీరుచు నుండును. సంకల్పబలము, ప్రయత్నబలము లేని వారికి కోరికలు తీరు అవకాశము తక్కువ. పురుష ప్రయత్నమున్న చోటనే దైవానుగ్రహము కూడ కాలానుసారము తీరుచునుండును. తీరుట, తీరక పోవుట కాలమును బట్టి యుండును. ఇందు జీవుల కోరిక ఇచ్ఛా శక్తి సంబంధితము. ఇచ్ఛ యందలి బలమే ఇంధనముగ ప్రయత్నము సాగును.
ప్రయత్న బలము క్రియాశక్తి స్వరూపము. కేవలము ఇచ్ఛ యున్న చాలదు. అది క్రియా రూపమును ధరింప వలెను. అట్లే ప్రయత్నము జ్ఞానపూర్వకముగ నుండవలెను. ఇచ్ఛను పరిపూర్ణము గావించు కొనుటకు తగిన జ్ఞానము, అటుపై ప్రయత్నమున సమర్థత ముఖ్యము. ఇట్లు ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తుల వలన కోరికలు ఫలింపవచ్చును. ఫలించునని నిశ్చయముగ చెప్పలేము. ఫలించుట, ఫలింప కుండుట కాలము చేతిలో యున్నది. సృష్టి యందు దైవమే కాలరూపమున వర్తించు చుండును. కాలానుసారముగ త్రిశక్తుల బలమాధారముగ కోరికలు ఫలించు చుండును. కనుక కోరికలు తీరుట అనునది దైవానుగ్రహమని తెలియవలెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
12 Jan 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment