గీతోపనిషత్తు -318
🌹. గీతోపనిషత్తు -318 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 23 -1 📚
🍀 23-1. త్రికరణశుద్ధి - నామరూపములతో కూడిన దేవతల నారాధించినపుడు వారు నన్నే ఆరాధించుచున్నను అట్టి వారి ప్రజ్ఞ పరిమిత మగుచుండును. కారణమేమనగా వారు సర్వవ్యాప్తి యగు నన్ను ఒక నామమునకు, రూపమునకు పరిమితము చేసుకొను చున్నారు. అంతట వ్యాప్తి చెందిన నన్ను కేవలము ఒక రూపమునకు, ఒక నామమునకు పరిమితముచేసి ఆరాధించు నపుడు వారి ప్రజ్ఞ, బుద్ధి పరిమితమగును. విశ్వరూపుడనై యున్న నన్ను వారు తెలియలేరు. కేవలమొక రూపమునకే, ఒక నామమునకే పరిమితమై ఇతరమంతను నిరాకరింతురు. అట్టి నిరాకరణము వలన వారు నన్ను పొందలేకున్నారు. 🍀
23. యో వ్యన్య దేవతాభక్తా యజంతే శ్రద్ధయాన్వితా: |
తే2 పి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకమ్ ||
తాత్పర్యము : విధి పూర్వకము కాకున్నను, భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఇతర దేవతలను ఆరాధించుచున్నారో, వారు కూడ నన్నే ఆరాధించు చున్నారు.
వివరణము : సమస్త దేవతల రూపమునను నేనే అధిష్ఠించి యున్నాను. దేవతలే అన నేల సమస్త జీవరూపములును నేనే అధిష్ఠించి యున్నాను గదా! కనుక ఏ దేవతా రూపము నారాధించి నను నన్నారాధించినట్లే. నామరూపములతో కూడిన దేవతల నారాధించినపుడు వారు నన్నే ఆరాధించుచున్నను అట్టి వారి ప్రజ్ఞ పరిమిత మగుచుండును. కారణమేమనగా వారు సర్వవ్యాప్తి యగు నన్ను ఒక నామమునకు, రూపమునకు పరిమితము చేసుకొను చున్నారు.
అంతట వ్యాప్తి చెందిన నన్ను కేవలము ఒక రూపమునకు, ఒక నామమునకు పరిమితముచేసి ఆరాధించు నపుడు వారి ప్రజ్ఞ, బుద్ధి పరిమితమగును. వారు ఇతర రూపములు, నామములతో నున్న జీవుల నధిష్ఠించియున్న నన్ను తిరస్కరింతురు. అనేకానేక రూపములతో విశ్వరూపుడనై యున్న నన్ను వారు తెలియలేరు. కేవలమొక రూపమునకే, ఒక నామమునకే పరిమితమై ఇతరమంతను నిరాకరింతురు. అట్టి నిరాకరణము వలన వారు నన్ను పొందలేకున్నారు. అట్లు పొందలేక, తమకు నచ్చిన నామమే దైవమని, తమకు నచ్చిన రూపమే దైవమని నిర్ధారించుచు, సిద్ధాంతము లేర్పరచి, రాద్ధాంతము చేయు చుందురు. ఇట్టివారే దేవుని పేరిట యుద్ధములు, మారణకాండ సృష్టింతురు. మా దైవము గొప్పది, మా దైవమే అందరికి శరణ్యము, మేము నమ్మిన నామ రూపమే సర్వమునకు రక్ష, ఇత్యాది ఉన్మాద పూర్వకమగు భాషణములు చేయుచు కల్లోలములు, కలహములు పెంచుకొనుచు నుందురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
07 Feb 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment