శ్రీ శివ మహా పురాణము - 516


🌹 . శ్రీ శివ మహా పురాణము - 516 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 44

🌻. మేన యొక్క మంకు పట్టు - 2 🌻


గంగాజలమును పారబోసి నీవు నూతి త్రాగితివి. నీవు సూర్యుని విడిచి ప్రయత్న పూర్వకముగా మిణుగురు పురుగును పట్టుకున్నావు (11). నీవు బియ్యమును విడిచి ఊకను భక్షించితిని. నేతిని పారబోసి ఆముదమును భుజించితివి (12). సింహసేవను వీడి నీవు నక్కను సేవించితివి.నీవు బ్రహ్మవిద్యను విడిచి పెట్టి చెడుగాథను వింటివి (13). ఇంటిలోని పరమమంగళకరమగు యజ్ఞ విభూతిని దూరము చేసి, ఓ అమ్మాయి! నీవు అమంగళకరమగు చితాభస్మను స్వీకరించితివి (14).

పరమ ప్రభువులగు విష్ణువు మొదలగు దేవోత్తములను విడిచి పెట్టి దుర్బుద్ధివగు నీవు ఇట్టి తపస్సును శివుని కొరకు చేసితిని (15), నీ బుద్ధికి, రూపమునకు, నీ ప్రవృత్తికి, నీకు ఉపదేశము చేసిన వానికి, నీ ఇద్దరు సఖరాండ్రకు నింద యగు గాక! (16).

ఓ అమ్మాయీ! నీవు జన్మ నిచ్చిన మేమిద్దరము నిందార్హలము. ఓ నారదా! నీ బుద్ధికి, మంచి బుద్ధిని కలిగించు సప్తర్షులకు (17) కులమునకు, కర్మలను చేసే సామర్ధ్యమునకు నిందయగు గక! నీవు సర్వమును నిందార్హము చేసితివి. ఈ ఇంటిని నీవు నాశనము చేసితివి. నాకు మరణమే గతి (18).

ఈ పర్వతరాజు నా దరిదాపులకు రాకుండుగా! సప్తర్షులు వారి ముఖము నాకు చూపకుందురు గాక! (19) అందరు కలిసి ఏమి సాధించిరి? నా కులము నాశనమైనది. నేను గొడ్రాలుగా ఏల పుట్టలేదో? నా గర్భము ఏల భగ్నము కాలేదో? (20) నేను ఏల మరణించలేదో? లేక, నా పుత్రిక ఏల మరణించలేదో? రాక్షసుడు ఈనాడు నా కుమార్తెను గగన వీధికి తీసుకువెళ్లి ఏల భక్షించడో? (21) నీ శిరస్సును నేనీనాడు నరికివేసెదను. ఈ దేహములతో పని ఏమి గలదు? నిన్ను విడిచి నేనెచటకు పోగలను? అయ్యో! నా జీవితము నాశనమైనది (22).


బ్రహ్మ ఇట్లు పలికెను -

మిక్కిలి దుఃఖితురాలగు ఆ మేన ఇట్లు పలికి మూర్ఛిల్లి భూమిపై పడెను. శోకము, రోషము మొదలగు కారణములచే ఆమె తన భర్త వద్దకు వెళ్లలేదు (23). ఓ మహర్షీ! ఆ సమయములో పెద్ద హాహాకారమును చేసిరి. క్రమముగా దేవతలందరు ఆమె ఉన్నచోటికి విచ్చేసిరి (24). ఓ దేవర్షీ! నేను కూడా అపుడు అచటకు స్వయముగా విచ్చేసితిని. నన్ను చూసి నీవు ఈ మాటలను ఆమెతో పలికితివి (25).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


07 Feb 2022

No comments:

Post a Comment