గీతోపనిషత్తు -320







🌹. గీతోపనిషత్తు -320 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 23 -3 📚


🍀 23-3. త్రికరణశుద్ధి - యాంత్రికముగ దైవారాధన చేయువారికి ఎట్టి వికాసము ఏర్పడదు. మూఢ నమ్మకములు, అంధ విశ్వాసములు, దైవమును గూర్చిన భయము ఇత్యాదివి వారిని బంధించి సంప్రదాయములకు బద్ధులను చేయును. కనుక ఆరాధన విషయమున భక్తి శ్రద్ధలు ప్రధానము. త్రికరణశుద్ధిగ ఆరాధన చేయుటయే భక్తి శ్రద్ధ యుతమైన ఆరాధన. అట్టి వారియందు దైవమే ప్రసన్నుడై జ్ఞాన వైరాగ్య యోగమార్గములను క్రమముగ పరిచయము చేయును. త్రికరణ శుద్ధిగల మూర్తుల ననేకులను దైవము మహా జ్ఞానులు గను, మహర్షులుగను తీర్చిదిద్దినాడు. వాల్మీకి, కాళిదాసు అట్టి వారు. వారెంత మూర్ఖులైనప్పటికిని, వారి త్రికరణశుద్ధియే వారికి వరమై సర్వజ్ఞతకు దారి చూపెను. 🍀

23. యో వ్యన్య దేవతాభక్తా యజంతే శ్రద్ధయాన్వితా: |
తే2 పి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకమ్ ||

తాత్పర్యము : విధి పూర్వకము కాకున్నను, భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఇతర దేవతలను ఆరాధించుచున్నారో, వారు కూడ నన్నే ఆరాధించు చున్నారు.

వివరణము : జ్ఞానముచే అజ్ఞానము దహింపబడగ, పరిమితమగు తన అవగాహన క్రమముగ అపరిమితము అగుచుండును. నిరాకరణ తగ్గుచు నుండును. అన్నిటి యందును దైవమును చూచు ప్రయత్న మారంభమగును. ఇట్లు సంభవించుటకు భక్తి శ్రద్ధలు ప్రధానము. యాంత్రికముగ దైవారాధన చేయువారికి ఎట్టి వికాసము ఏర్పడదు. మూఢ నమ్మకములు, అంధ విశ్వాసములు, దైవమును గూర్చిన భయము ఇత్యాదివి వారిని బంధించి సంప్రదాయములకు బద్ధులను చేయును. కనుక ఆరాధన విషయమున భక్తి శ్రద్ధలు ప్రధానము. త్రికరణశుద్ధిగ ఆరాధన చేయుటయే భక్తి శ్రద్ధ యుతమైన ఆరాధన. అట్టి వారియందు దైవమే ప్రసన్నుడై జ్ఞాన వైరాగ్య యోగమార్గములను క్రమముగ పరిచయము చేయును.

వారి భక్తి శ్రద్ధలకు ముచ్చటపడి, వాత్సల్యముతో దైవమే దారి చూపుట అనుగ్రహము. త్రికరణ శుద్ధిగల మూర్తుల ననేకులను దైవము మహా జ్ఞానులు గను, మహర్షులుగను తీర్చిదిద్దినాడు. వాల్మీకి, కాళిదాసు అట్టి వారు. వారెంత మూర్ఖులైనప్పటికిని, వారి త్రికరణశుద్ధియే వారికి వరమై సర్వజ్ఞతకు దారి చూపెను. ఈ శ్లోకము, ఈ రహస్యమును ఆవిష్కరించుచున్నది. ఇచ్చట భక్తి శ్రద్ధలనగా త్రికరణ శుద్ధియే. లౌక్యము, తెలివితేటలుగల వారికన్న త్రికరణశుద్ధి గలవారే దైవమునకు ప్రీతిపాత్రులు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


11 Feb 2022

No comments:

Post a Comment