శ్రీ శివ మహా పురాణము - 518


🌹 . శ్రీ శివ మహా పురాణము - 518 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 44

🌻. మేన యొక్క మంకు పట్టు - 4 🌻



మేన ఇట్లు పలికెను -

నే నామెను కత్తితో నరికి వేయుటకైనా సిద్ధమే గాని, ఆమెను శంకరునకు ఈయను. మీరందరు దూరముగా పొండు. నా సమీపమునకు రావద్దు (38).

బ్రహ్మ ఇట్లు పలికెను -

మిక్కిలి దుఃఖితురాలగు ఆమె ఏడుస్తూ ఇట్లు పలికి మిన్నకుండెను. ఓ మునీ! ఆమె ప్రవర్తనను చూచి అచట ఉన్న వారందరు హాహాకారమును బిగ్గరగా చేసిరి (39). అపుడచటకు కంగారు పడుతూ హిమవంతుడు వచ్చెను. అతడు ఆమెకు సత్యమును ప్రేమతో బోధించి సర్దిచెప్పుటకు యత్నించెను (40).

హిమవంతుడిట్లు పలికెను -

ఓ మేనా! ప్రియురాలా! ఇప్పుడు నా మాటను వినుము. నీవు దుఃఖించుచుంటివేల ? ఎవరెవరు ఇంటికి వచ్చిరి? వారిని నీవెట్లు నిందించుచుంటివి? (41). శంకరుడు నీకు తెలిసిన వాడే. అనేక నామములను రూపములను ధరించు ఆ శంభుని భయంకర రూపమును చూచి నీవు కంగారు పడితివి (42). ఆ శంకరుని నేను ఎరుంగుదును. అందరినీ రక్షించువాడు ఆయనయే. ఆయన పూజ్యులలోకెల్ల పూజ్యుడు. అను గ్రహ నిగ్రహములను చేయువాడు ఆయనమే (43). ఓ ప్రాణాప్రియురాలా! మొండి పట్లు పట్టకుము. దుఃఖమును వీడుము. ఓ పూజ్యురాలా! వెంటనే లెమ్ము. గొప్ప వ్రతము గలదానా! నీ కర్తవ్య కర్మను నీవు చేయదగుదువు (44)

ఇంతకు ముందు శంభుడు వికృతరూపమును ధరించి ద్వారము వద్దకు వచ్చి అనేక లీలలను చేసినాడు. ఆ లీలను నీకిపుడు నేను గుర్తు చేయుచున్నాను. (45). ఓ దేవీ! మనము అపుడు ఆయన యొక్క మహిమను చూచి, ఇద్దరము కన్యను ఇచ్చుటకు అంగీకరించి యుంటిమి. ఓ ప్రియురాలా! ఆ అంగీకారమును ప్రమాణముగా చేసుకొనుము.

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మునీ! ఇట్లు పలికి ఆ పర్వతేశ్వరుడు విరమించెను. పార్వతి తల్లియగు మేన ఆ మాటను విని హిమవంతునితో నిట్లనెను (47).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


11 Feb 2022

No comments:

Post a Comment