గీతోపనిషత్తు -325
🌹. గీతోపనిషత్తు -325 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 25-1 📚
🍀 25-1. పరమపదము - అంతర్బహిః వ్యాప్తి చెంది యున్న శాశ్వతమగు తత్త్యమును నారాధించు వారు తత్త్వదర్శనులై, తత్ పదమును చేరుదురు. అదియే పరమపదము. ఈ పరమపదము లోకముల కతీతము. సమస్త జీవుల ఉనికికి మూలము. అందే అన్నీ ఇమిడి యుండి కాలక్రమమున బయల్వెడలి, వృద్ధి చెంది, తిరోగమించి మరల అందులోనికే లయ మగుచుండును. అట్టి పదము లోకములకు మూలమై యున్నది. సత్యలోకము, వైకుంఠము, కైలాసము అను లోకములకు కూడ పరమై యున్నది. అట్టి పరమును బ్రహ్మపరమని, పరమ పదమని తెలుపుదురు. 🍀
26. యాంతి దేవవ్రతా దేవాన్ పితన్ యాంతి పితృవ్రతాః |
భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినోలి పి మామ్ ||
తాత్పర్యము : దేవతల నారాధించువారు దేవతాలోకములు చేరుదురు. పితృదేవతల నారాధించువారు పితృలోకము చేరుదురు. భూతప్రేతముల నారాధించువారు ఆ లోకములను చేరుదురు. నన్నారాధించు వారు నన్ను చేరుదురు.
వివరణము : భగవద్గీత యందు, అంతర్బహిః వ్యాప్తి చెంది యున్న శాశ్వతమగు తత్త్యమును, సమస్తమునకు మూలముగను ఆధారముగను తెలుపబడినది. దానిని “నేను” అను ప్రజ్ఞగ దైవము పలికినాడు. అట్టి తత్త్వము నారాధించువారు తత్త్వదర్శనులై, తత్ పదమును చేరుదురు. అదియే పరమపదము. అట్టి పదము లోకములకు మూలమై యున్నది. సత్యలోకము, వైకుంఠము, కైలాసము అను లోకములకు కూడ పరమై యున్నది. అట్టి పరమును బ్రహ్మపరమని, పరమ పదమని తెలుపుదురు. బ్రహ్మ విష్ణు మహేశ్వర లోకములు కూడ అందుండి ఏర్పడునవే. అట్టి లోకమును నిత్యమనుభవించువారు బ్రహ్మర్షులు. త్రిమూర్తులు సహితము అట్టి బ్రహ్మర్షులను గౌరవింతురు, పూజింతురు కూడ.
ఈ పరమపదము లోకముల కతీతము. సమస్త జీవుల ఉనికికి మూలము. అందే అన్నీ ఇమిడియుండి కాలక్రమమున బయల్వెడలి, వృద్ధి చెంది, తిరోగమించి మరల అందులోనికే లయ మగుచుండును. ఈ పరమును చేరినవారు జనన మరణ చక్రమునకు అతీతమై శాశ్వతముగ యుందురు. వారికి కేవలమమరత్వమేగాక బ్రహ్మత్వము కూడ అందిన ఫలమై యుండును. అట్టివారు బ్రహ్మమై యుందురు. అగస్త్య వశిష్ఠు లట్టివారు. పై తెలిపిన పరమపదమును పొందుట కారాధించవలసినది తత్త్వమునే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
21 Feb 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment