శ్రీ శివ మహా పురాణము - 523


🌹 . శ్రీ శివ మహా పురాణము - 523 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 44

🌻. మేన యొక్క మంకు పట్టు - 9 🌻


ఆయన రూపమును ఎవరు వర్ణించగలరు? వర్ణన యేల? ఎరింగిన వారెవ్వరు? నాకు గాని, బ్రహ్మకు గాని ఆయన యథార్థ స్వరూపము తెలియనే లేదు (94). బ్రహ్మ గారి నుండి గడ్డిపోచ వరకు ఈ జగత్తు అంతయూ శివ స్వరూపమేనని తెలుసుకొనుము. ఈ విషయములో నీవు సందేహించకుము (95).

ఆయన తన లీలచే ఇట్టి స్వరూపముతో అవతరించినాడు. పార్వతి చేసిన తపస్సు యొక్క మహిమచే నీ గుమ్మము వద్దకు వచ్చియున్నాడు. (96). ఓ హిమవంతుని పత్నీ ! కావున నీవు దుఃఖమును వీడి శివుని భజింపుము. నీకు మహానందము కలుగ గలదు. నీ దుఃఖము పూర్తిగా నశించగలదు (97).


బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ ! ఇట్లు విష్ణువు బోధ చేయగా ఆ మేనక యొక్క మనస్సు కొద్దిగా మెత్తపడెను (98). కాని ఆమె తన మొండి తనమును వీడలేదు. శివుని మాయచే విమోహితురాలైన ఆ మేన ఆ సమయములో పార్వతిని శివునకు ఇచ్చుటకు అంగీకరించలేదు (99).

హిమవత్పత్ని. పార్వతి తల్లి యగు ఆ మేన విష్ణువుయొక్క మధురమగు బోధను విని జ్ఞానమును పొందినదై విష్ణువుతో నిట్లనెను (100). అతడు సుందరాకారుడైనచో నేను కుమార్తెను ఇచ్చెదను. అట్లు కానిచో కోటి యత్నములు చేసిననూ నేను ఈయను. నేను సత్యము, దృఢము అగు వచనమును పలుకు చున్నాను (101).


బ్రహ్మ ఇట్లు పలికెను-

దృఢదీక్ష గల మేన శివుని ఇచ్ఛచే ప్రేరితురాలై ఇట్లు పలికి మిన్నకుండి ధన్యురాలయ్యెను. సర్వప్రాణులను ఆ శివచ్ఛయే మోహింపజేయును (102)

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో మేనా ప్రబోధమనే నలుబది నాల్గవ అధ్యాయము ముగిసినది (44).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


21 Feb 2022

No comments:

Post a Comment