గీతోపనిషత్తు -342
🌹. గీతోపనిషత్తు -342 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 30 📚
🍀 30-2. శ్రద్ధాభక్తులు - కనపడుచున్నది, వినపడుచున్నది దైవమే అని గుర్తుండిన చాలును. దీని వలన నిత్య స్మరణము, అనన్యచింతన సహజముగ నుండును. అట్టి వానికి సూటిగ దైవ సంబంధ మేర్పడును. తత్కారణముగ సాలోక్య, సామీప్య, సాయుజ్య, సారూప్యములు సిద్ధించును. రాజవిద్య యందు ఒకే ఒక సూత్రము తెలుప బడినది. అన్నిట అంతట, లోపల బయట దైవమును దర్శించుట. 🍀
30. అపి చేత్పుదురాచారో భజతే మా మనన్యభాక్ |
సాధురేవ సమంతవ్య స్సమ్యగ్వ్యవసితో హి సః ||
తాత్పర్యము : ఎంత దురాచారు డైనప్పటికిని అనన్య భక్తితో నన్ను సేవించునేని అతడు స్థిరమైన మనసును బొంది క్రమముగ సత్పురుషుడుగ తలంప బడుచున్నాడు.
వివరణము : రాజవిద్య యందు ఒకే ఒక సూత్రము తెలుప బడినది. అన్నిట అంతట, లోపల బయట దైవమును దర్శించుట. ఇది అందరికిని ప్రయత్నమున అందుబాటగు విషయము. పూజలు చేయుట, అభిషేకములు చేయుట, హోమములు చేయుట, యాగములు చేయుట- ఇత్యాదివి ఆవశ్యకత లేదు. మంత్రములు పేనుట (మరల మరల స్మరించుట), తంత్రశాస్త్రము నేర్చుకొనుట, యంత్రములను ధరించుట అవసరమే లేదు. వేద పారాయణములు, మండల దీక్షలు, తీర్ధయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనములు అవసరము లేదు. ప్రదక్షిణములు, పర్వతారోహణములు ఇత్యాది శ్రమ దైవము తెలుపలేదు. చూచుటకు కన్నులున్నవి. వినుటకు చెవు లున్నవి. కనపడుచున్నది, వినపడుచున్నది దైవమే అని గుర్తుండిన చాలును.
దీని వలన నిత్య స్మరణము, అనన్యచింతన సహజముగ నుండును. అట్టి వానికి సూటిగ దైవ సంబంధ మేర్పడును. తత్కారణముగ సాలోక్య, సామీప్య, సాయుజ్య, సారూప్యములు సిద్ధించును. విపరీతమగు ఆచారకాండలు, సంప్రదాయములు, కట్టు బాట్లు అనెడి తామరతంపర లేమియు ఉండవు. దైవాను సంధానము సులభముగ తెరిపిగ యుండును. దైవాను సంధానము ఎప్పుడునూ ఉండును. అట్లుండుటయే రాజయోగము. అందులకు మూలము రాజవిద్య. ఇట్లు సూటిగ దైవముతో మానవుడు అనుసంధానము చెందు విధానము ఉండగా, డొంక తిరుగుడు మార్గములలో శ్రమ పడుట వృథా.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
27 Mar 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment