గీతోపనిషత్తు -356
🌹. గీతోపనిషత్తు -356 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 34 📚
🍀 34-2. జీవేశ్వర సంబంధము - సమస్తమగు ప్రవర్తనముల యందు ఈశ్వరునే దర్శించుట సేవించుట దిన చర్యగ సాగినపుడు క్రమముగ సమస్తమందలి ఈశ్వరునితో తనకనుబంధము పెరుగును. ఈశ్వరునికి కూడ తాను చేరువగును. గురువు శిష్యుడై, శిష్యుని గురువును చేయుట, తండ్రి కుమారుడై, కుమారుని తండ్రిగ చేయుటవలె జీవేశ్వర సంబంధమున ఈశ్వరుడే జీవుని నుండి ప్రకటించు కొనుచు, జీవుని ఈశ్వరునంత వానిగ మలచును. 'రాజవిద్యా రాజగుహ్య యోగ' వివరణము సంపూర్ణము. 🍀
34. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు ।
మా మేవైష్యసి యుక్త్యేవ మాత్మానం మత్పరాయణః ||
తాత్పర్యము : మనసున నన్నే భావింపుము. అందరి యందు నన్నే దర్శించి సేవింపుము. నన్ను దర్శించుచునే ఎదుటి వానికి నమస్కరింపుము. అన్ని అవస్థల యందు నన్నే కూడి
యుండుము. అపుడు నీవు నేనుగ, నేను నీవుగ ఏకమై యుందుము.
వివరణము : ఎవరికైనను తను నమస్కరించు చున్నపుడు వాని యందలి ఈశ్వరునికే నమస్కరింపవలెను. అట్లే ఎవరైనను తనకు నమస్కరించు చున్నపుడు తనలోని ఈశ్వరునికే నమస్కరించు చున్నాడని పూజ్యభావము కలిగి యుండవలెను. తనకు నమస్కరించు చున్నారని మోహపడరాదు, గర్వపడరాదు. ఇట్లు సమస్తమగు ప్రవర్తనముల యందు ఈశ్వరునే దర్శించుట సేవించుట దిన చర్యగ సాగినపుడు క్రమముగ సమస్తమందలి ఈశ్వరునితో తనకనుబంధము పెరుగును. ఈశ్వరునికి కూడ తాను చేరువగును.
ఇట్లొకరియందొకరికి అవినాభావ సంబంధము పెరుగుచుండగ ఈశ్వరుడు అనుగ్రహించి జీవుని యందు అవతరించును. జీవుడీశ్వరుడై వెలుగును. గురువు శిష్యుడై, శిష్యుని గురువును చేయుట, తండ్రి కుమారుడై, కుమారుని తండ్రిగ చేయుటవలె జీవేశ్వర సంబంధమున ఈశ్వరుడే జీవుని నుండి ప్రకటించు కొనుచు, జీవుని ఈశ్వరునంత వానిగ మలచును. “నాకు నమస్కరించిన వానిని నా అంత వానిగ చేయుదును” - ప్రణత నిజజనాన్ స్వాత్మ తుల్యాన్ కరోతి అనునది రాజగుహ్య మగు రాజవిద్య. ఇదియే రాజయోగము.
శ్రీమద్భగవద్గీత యందలి 9వ అధ్యాయము 'రాజవిద్యా రాజగుహ్య యోగ' వివరణము సంపూర్ణము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
24 Apr 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment