శ్రీ శివ మహా పురాణము - 22

🌹. శ్రీ శివ మహా పురాణము - 22 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
సేకరణ 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. విద్యేశ్వర సంహితా 🌴


అధ్యాయము - 9

🌻. శివరాత్రి - అరుణాచలము - 3 🌻

తదజ్ఞానేన వాం వృత్తం ఈశమానం మహాద్భుతమ్‌ | తన్నిరాకర్తు మత్రైవముత్థితోsహం రణక్షితౌ || 33

త్యజతం మానమాత్మీయం మయీశే కురు తం మతిమ్‌ | మత్ర్పసాదేన లోకేషు సర్వోsప్యర్థః ప్రకాశ##తే || 34

గురూక్తి ర్వ్యంజకం తత్ర ప్రమాణం వా పునః పునః | బ్రహ్మ తత్త్వ మిదం గూఢం భవత్ర్పీత్యా భణామ్యహమ్‌ || 35

అహమేవ పరం బ్రహ్మ మత్స్వరూపం కలాకలమ్‌ | బ్రహ్మత్వా దీశ్వరశ్చాహం కృత్యం మేనుగ్రహాదికమ్‌ || 36

బృహత్త్వాద్బృంహణత్వాచ్చ బ్రహ్మాహం బ్రహ్మకేశవౌ | సమత్వా ద్వ్యాపకత్వాచ్చ తథైవాత్మహ మర్భకౌ || 37

కాన మీ ప్రవర్తన అజ్ఞాన జనితము.'నేను ఈశుడను' అను గర్వము మీకు కలుగుటయే గొప్ప ఆశ్చర్యము. ఈ గర్వమును తొలగించుట కొరకై నేనిచట రణరంగము నందు ఆవిర్భవించితిని (33).

మీరీ గర్వమును వీడి, ఈశుడనగు నన్ను ధ్యానించుడు. ఈ లోకములో సర్వ పదార్థములు నా అనుగ్రహము చేతనే ప్రకాశించుచున్నవి (34).

గురువచనము ఈ సత్యమునే బోధించుచున్నది. ఇదియే ప్రామాణిక వచనము. ఈ బ్రహ్మతత్త్వము రహస్యము. నేను దీనిని మీయందలి ప్రీతి వలన చెప్పుచున్నాను (35).

పరబ్రహ్మ నేనే. నాస్వరూపము సాకారము, నిరాకారము కూడా. పరబ్రహ్మను నేనే; ఈశ్వరుడను నేనే. అనుగ్రహము, సృష్టి ఇత్యాది జగత్కార్యమును చేయునది నేనే (36).

బ్రహ్మ విష్ణువులారా! సర్వము కంటె పెద్దవాడను అగుటచేతను, సర్వమును వ్యాపించుట చేతను, నాకు బ్రహ్మ అని పేరు. కుమారులారా! సర్వులలో ఏకరూపముగ వ్యాపించియుండటచే నాకు ఆత్మ యని పేరు (37).

అనాత్మనః పరే సర్వే జీవా ఏవన సంశయః | అనుగ్రహాంతం సర్గాద్యం జగత్‌ కృత్యం చ పంచకమ్‌ || 38

ఈశత్వాదేవ మే నిత్యం న మ దన్యస్య కస్య చిత్‌ | అదౌ బ్రహ్మత్వ బుద్ధ్యర్థం నిష్కలం లింగముత్థితమ్‌ || 39

తస్మాదజ్ఞాతమీశత్వం వ్యక్తం ద్యోతయితుం హి వామ్‌ | సకలోsహమతో జాతస్సాక్షాదీశస్తు తత్‌ క్షణాత్‌ || 40

సకలత్వమతో జ్ఞేయ మీశత్వం మయి సత్వరమ్‌ | యదిదం నిష్కలం స్తంభం మమ బ్రహ్మత్వ బోధకమ్‌ || 41

ఇతరులందరు అనాత్మలు, జీవులు అనుటలో సందియము లేదు. సృష్టి మొదలు అనుగ్రహము వరకు గల పంచ విధి జగత్కార్యము (38).

ఈశుడనగు నా యందు నిత్యముగ నుండును. నాకంటె వేరుగా మరియొకనికి ఈ ఐదు కర్మలే లేవు. ముందుగా బ్రహ్మభావనను బుద్ధియందు కలిగించుటకై నేను నిరాకార లింగరూపముగా ఆవిర్భవించితిని (39).

కాని, లింగదర్శనము వలన మీకు నా ఈశ్వరభావము తెలియకుండును గాన, సాక్షాత్తుగా ఈశుడనగు నేను వెనువెంటనే మీ ముందు సాకారముగా ప్రత్యక్షమైతిని (40).

సాకారుడనగు నేను ఈశుడనని తెలియుడు. ఈ నిరాకారస్తంభము నా బ్రహ్మభావమును బోధించును (41).

లింగలక్షణ యుక్తత్వాన్మమ లింగం భ##వేదిదమ్‌ | తదిదం నిత్యమభ్యర్చ్యం యువాభ్యామత్ర పుత్రకౌ || 42

మదాత్మక మిదం నిత్యం మమ సాన్నిధ్య కారణమ్‌ | మహత్పూజ్యమిదం త్యమభేదాల్లింగలింగినోః || 43

యత్ర ప్రతిష్ఠితం యేన మదీయం లింగమీదృశమ్‌ | తత్ర ప్రతిష్ఠితస్సోsహ మప్రతిష్ఠోsపి వత్సకౌ || 44

మత్సామ్యమేక లింగస్య స్థాపనే ఫలమీరితమ్‌ | ద్వితీయే స్థాపితే లింగే మదైక్యం ఫలమేవ హి || 45

లింగం ప్రాధాన్యతః స్థాప్యం తథా బేరం తు గౌణకమ్‌ | లింగాభావే న తత్‌ క్షేత్రం సబేరమపి సర్వతః || 46

ఇతి శ్రీ శివ మహా పురాణ విద్యేశ్వర సంహితాయాం నవమోsధ్యాయః || (9)

ఈ స్తంభము లింగాకారముగా నున్నది గనుక, లింగమే యగును. పుత్రులారా! మీరిద్దరు దీనిని నిత్యము అర్చించుడు (42).

లింగము నా స్వరూపమే. లింగ సన్నిధి నా సన్నిధియే. ఈ మహాలింగమును నిత్యము పూజించవలెను. నాకు, లింగమునకు భేదము లేదు (43).

వత్సలారా! నేను నిరాశ్రయుడనే, అయిననూ, ఇట్టి లింగము ప్రతిష్ఠింబడినచోట నేను కూడ స్థిరముగ నుందును (44).

ఒక లింగమును స్ధాపించిన వానికి సారూప్యము అను మోక్షము ఫలము. అదే వ్యక్తి రెండవ లింగమును కూడ స్థాపించినచో, సాయుజ్యమను మోక్షమును పొందును (45).

సర్వత్రా లింగమును ప్రధానముగను, మూర్తిని అప్రధానముగను స్థాపించవలెను. మూర్తి ఉన్ననూ, లింగము లేనిచో, అది క్షేత్రము కానేరదు (46).

శ్రీ శివ మహా పురాణములోని విద్యేశ్వర సంహిత యందు తొమ్మిదవ అధ్యాయము ముగిసినది.



సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment