భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 120


🌹.   భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 120   🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. నరనారాయణ మహర్షులు - 1 🌻

🌻. జ్ఞానం:

1. శ్రీమహావిష్ణువు యొక్క ఏకవింశతి (ఇరవైఒకటి) అవతారములలో నరనారాయణావతారము నాలుగవది.

2. ఆదివిష్ణువు భూమిపై అవతరించి అపుర్వమైన తపస్సుచేసి దాని ప్రభావంచేత రాక్షసవినాశనం, లోకసమ్రక్షణ చేయదలచి, ధర్ముడు అనే మహాత్ముడి భార్యకు కవలౌగా ఉదయించాడు. ఆ కవలలే నరనారాయణులు.

3. ఒకసారి నారదుడు వీళ్ళ దర్శనానికి వచ్చి, “సిద్ధిపొందాలంటే దేనిని ఆరాధించాలి?” అని అడిగాడు. అప్పుడు వాళ్ళు నారదుడితో, “నారదా! ధృవము, అచలము, ఇంద్రియాలకు అగోచరము, సూక్షమము, అనుపమము(అంటే దేనితోటీ పోల్చటానికి వీలుకానిది), సర్వములకు అంతరాత్మఅయి వెలిగే ఒక సత్యమున్నది. దీనినే తప్ప ఇంక ఏమీ ఆరాధించకూడదు. అంతకుమించి సేవింపదగిన వస్తువేలేదు. బ్రహ్మమొదలుగా సకల భూతములూ ఆ తత్త్వములోనే ఉన్నాయి” అన్నారు.

4. మనం చెప్పుకునే ‘యదంతస్తదుపాసితవ్యమ్’ అంతే ఇదే. అంటే లోపల ఉన్నదే ఉపాస్యవస్తువు. బాహ్యమైనది కాదు. రోజూ మంత్రపుష్పంలో, ‘సబ్రహ్మ స్సశివః సహరిఃసేంద్రస్సోక్షరః పరమస్వరాట్’ అంటూ ఇదే చెబుతాము. అది అక్షరమైనది. అదే బ్రహ్మ, అదే హరి, అదే ఇంద్రుడు, అదే పరమస్వరాట్ అని అర్థం.

5. ఎంత పూజచేసినప్పటికీ, “నేను చేసిన ఈ పూజ బాహ్యపూజయే అయినప్పటికీ, దీనిని నేను ఇంద్రియములతో చేసినప్పటికీ, నోటితో-చేతితో- చేసినప్పటికీ; ఈ పూజ సర్వజగత్తుకూ మూలకారణమైనటువంటి అంతర్వస్తువు ఏదైతే ఉన్నదో దానికి చెంది, దానినుంచి నాకుఫలం లభించాలి. నేను ఆ సత్యవస్తువును స్మరిస్తూ ఉన్నాను. దానివల్ల, అసత్పదార్థాలతో చేసినటువంటి ఈ చిన్నపూజ అనబడేవస్తువు – ఈ క్రియ-ఫలప్రదం కావాలి.

6. అలాగే భక్తిలోనూ, శ్రద్ధలోనూకూడా శూన్యమే అయిన ఈ పూజ(నేను చేసే పూజ) – అంతర్వస్తువుగా పరమాత్మను నేను స్మరించటంవలన ఫలప్రదం అగునుగాక!’ అని మంత్రపుష్పం అర్థమూ, ఉద్దేశ్యమూను. పూజ అయిపోయే సమయంలో ‘మంత్రహీనం క్రియాహీనం…’ అనడంలోని అంతరార్థం ఇదే. అదిలేకపోతే ఇది నిష్ఫలమవుతుంది.

7. కేవల భౌతికపూజ యఠార్థం అనుకోకూడదు. యజ్ఞం కానీ, పూజ కానీ లోపభూయిష్టంగానే ఉంటుంది. లోపంలేకుండా చేయగలిగిన కార్యము (పని) ఏమిటంటే, అంతర్వస్తువును ఒకసారి ధ్యానించి, నమస్కరించి అక్కడ ఒక పుష్పం పెట్టటమే.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


26 Sep 2020

No comments:

Post a Comment