✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 70 📚
ఆపూర్యమాణ మచలం ప్రతిష్ఠమ్
సముద్ర మాపః ప్రవిశంతి యద్వత్ |
తద్వత్కామా యం ప్రవిశంతి సర్వే
స శాంతి మాప్నోతి న కామ కామీ || 70
సముద్ర దర్శనము శుభకరమని పెద్దలు తెలుపుదురు. సృష్టియందు సముద్రమునకు ఒక విశిష్ట స్థానమున్నది. సముద్రమునందు నదుల నుండి, వాగుల నుండి, వర్షపాతము నుండి ఎంత జలము చేరినను సముద్రము పొంగదు. ఇదియొక విశిష్టస్థితి. ఎన్ని విషయములు సముద్రమున చేరినను సముద్రమట్లే యుండును.
దానియందు సమస్తము ఇముడును. ఇతరములు వచ్చి చేరుట వలన సముద్రము ఎల్లలు దాటదు. దానికి స్థిరమైన హద్దుమీరని ఉనికి కలదు. అది పూర్ణమైనది. అనగా నింపుటకు అవకాశము లేనిది. నిండి యున్నది గనుక నింపుటకు వీలుపడదు.
అట్లే శాంతిని పొందీ బుద్ధియందు స్థిరపడిన వానిని మరియే భోగ్య విషయములు మరింత శాంతిని, తృప్తిని కలిగింప జాలవు.
అతడు శాంతిగను తృప్తిగ నుండుటచే భోగ్య విషయములు మరింత శాంతిని, తృప్తిని ఇచ్చుట జరుగదు. నిండిన సముద్రమున మరింత నీరు చేర్చిన ఎట్లు పొంగదో శాంతి, తృప్తితో నిండిన మనస్సు మరి యే ఇతర విషయములకు పొంగదు.
సముద్రము నుండి సూర్య కిరణములు జలములను ఊర్ధ్వగతికి కొనిపోయి నను సముద్రమింకదు. అట్లే విషయలేమి కారణముగ శాంతుని చిత్తము క్రుంగదు. పొంగుట-క్రుంగుట సముద్రమునకు, శాంతచిత్తునకు లేవు.
ఇదియే బ్రహ్మానంద స్థితి. బుల్లి బుల్లి కోరికల యందు జీవిత మంతయు సతమతమగు వానికి ఈ స్థితి దుర్లభము. ఊహించుటకైననూ వీలుపడనిది. భగవానుడీ విధముగ తన నిజస్థితిని అర్జునునికి సూచన ప్రాయముగ తెలిపినాడు.
ప్రస్తుతము అర్జునుడున్న పరిస్థితికి భగవంతుడందించిన ఉదాహరణము అగ్రాహ్యము (బొత్తిగా అర్థము కాని విషయము). అయినను బీజప్రాయముగ అత్యుత్తమ విషయమును శిష్యునియందు ఆవిష్కరించుట సద్గురువు యొక్క దూరదృష్టి మరియు కరుణ అని తెలియవలెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
26 Sep 2020
No comments:
Post a Comment