భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 134



🌹.   భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 134   🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. నారద మహర్షి - 8 🌻

61. నిర్గుణ పరబ్రహ్మ వస్తువును తొలిగా నారదుడే స్వయంగా తెలుసుకోవాలి. తాను చెప్పడు. చెబితే తాను కార్యబ్రహ్మ కానేరడు. “నీవే తెలుసుకుంటావు ఆ అష్టాక్షరి అర్థమేదో!” అని చెప్పి, ఆయనను గమ్యస్థానానికి తీసుకు వెళ్ళగలిగిన మార్గాన్ని ఉపదేశించాడు బ్రహ్మ. అదే అష్టాక్షరీమార్గం.

62. గమ్యం నారదుడే చేరుకుంటాడు. అంతవరకే! తాను మార్గాన్ని ఉపదేశించిన గురువు. గమ్యస్థానానికి వెళ్ళలేక కష్టంలో ఉన్నప్పుడు, తానే వచ్చి ఆ గమ్యస్థానానికి చెర్చేవాడు గురువు అని చెప్పి; ఆద్యంతములందు గురువు ఉంటాడనీ, ఆయన ఆద్యంతరహితుడనీకూడా – అలా రెండువిధాలుగా చెప్పారు.

63. మహర్షి లక్షణం కూడా చెప్పాడు బ్రహ్మ. “జీవసృష్టికి సమయం వచ్చింది. ఈ జగత్తంతా భవిష్యత్తులో జీవులు పుట్టబోతున్నారు. వీళ్ళందరూకూడా కేవలం అజ్ఞానంలో లేరు. శుద్ధజ్ఞానంలోనూ లేరు.

64. అలాగే దేవతలందరూకూడా జ్ఞానాజ్ఞాన సమ్మిశ్రమంలో ఉన్నారు. వీళ్ళకు కొంతజ్ఞానం, కొంతఅజ్ఞానం ఉంది. వారికి తమకుతాము ఏంచేసుకోవాలో తెలియదు. మనుష్యజాతి పుడుతుంది. చరిత్ర అంతా భవిష్యత్తులో నేవే చూస్తావు, వెళ్ళునాయనా!” అన్నాడు బ్రహ్మ.

65. బ్రహ్మ తాను సృష్టించిన కొడుకులందరినీ ఒకసారి పిలిచి, “మీరు పుత్రులను కనండి! ప్రజలను సృష్టించండి. వివాహితుల కండి. మీకు భార్యలను నేను సృష్టిస్తాను” అన్నాడు. వాళ్ళు ఎవరూ ఏమీ మాట్లాడక, మౌనం వహించారు. తలలు వంచుకుని నిలబడ్డారు.

66. అప్పుడు వాళ్ళు తమలో తాము, “మేము స్వయంసమృద్ధిగా సుఖంగా ఉన్నాము, మేమిప్పుడు చేయాల్సిన పని ఏముంది? మేము బాగానే ఉన్నాము. ఈయన ఏదో పని చెపుతాడేమిటి? వివాహం చేసుకోమంటాడు. సంతానం కనమంటాడు. సంతానం ఏమిచేసుకోవాలో తెలియదు. అదంతా ఆయన పనేమో! ఆయన పని మనచేత చేయిస్తుంటాడు” అనుకున్నారు.

67. నారదుడి అభిప్రాయం కూడా అలాగే ఉంది. అయితే నారదుడు మాత్రం ఇతరుల వలే కాక, బయటపడ్డాడు: “తండ్రీ! నీవు ఇప్పుడే కదా అష్టాక్షరి చెప్పావు నాకు. ఆ విష్ణుపదం ఎక్కడో ఉంది. అది నీకు కూడా అందనంత దూరంలో ఎక్కడో ఉంది. ఆ విష్ణుపదం ఏమిటో చూద్దామనే ఆకాంక్ష నాలో కలిగింది.

68. ఈ అష్టాక్షరీ జపం నేను చేసుకుంటూ దీనిమార్గంలో వెళ్ళిపోతాను. నాకు అన్నగార్లున్నరు, సనకసనందాదులు. వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళను ఏమీ అనలేదు కదా! మరి వాళ్ళు ఆనందంలో ఉన్నారు. వాళ్ళు నాకంటే ముదుపుట్టినవాళ్ళు. మరి వాళ్ళు వెళ్ళిపోయారు కదా! నేనుకూడా వాళ్ళలాగానే వెళ్ళిపోతాను. నేను మాత్రం నువ్వుచెప్పినట్లు వివాహంచేసుకోను” అన్నాడు నారదుడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద


12 Oct 2020

No comments:

Post a Comment