శ్రీ శివ మహా పురాణము - 246



🌹 .  శ్రీ శివ మహా పురాణము - 246  🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

56. అధ్యాయము - 11

🌻. దుర్గాస్తుతి - 1 🌻

నారదుడిట్లు పలికెను -

తండ్రీ! బ్రహ్మన్‌! నీవు మహా బుద్ధిశాలివి. వక్తలలో శ్రేష్ఠుడవు. మాకు చెప్పుము. విష్ణువు నిష్క్రమించిన తరువాత ఏమయ్యెను? హే విధీ! నీవు ఏమి చేసితివి ?(1).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ బ్రాహ్మణశ్రేష్ఠా! నీవు సావధానముగా వినుము. విష్ణుభగవానుడు నిష్క్రమించగనే నేను చేసిన కార్యమేదియో చెప్పెదను (2).

విద్యాస్వరూపిణి, మరియు అవిద్యా స్వరూపిణి, శుద్ధ పరబ్రహ్మ రూపిణి, జగన్మాత, సర్వదా శివప్రియ అగు దుర్గాదేవిని స్తుతించెదను (3).

సర్వవ్యాపకురాలు, నిత్యస్వరూపిణి, ఇతర ఆశ్రయము లేనిది, సంసార దుఃఖములు లేనిది, ముల్లోకములకు తల్లి, గొప్ప వాటి కంటె కూడ గొప్పది, రూపము వాస్తవముగా లేనిది అగు దుర్గను నమస్కరించు చున్నాను (4).

చైతన్యము, బ్రహ్మానందము నీవే . నీవే పరమాత్మ స్వరూపిణివి. దేవదేవీ! నీవు ప్రసన్నురాలవు కమ్ము. నా కార్యము సిద్ధింపజేయుము. నీకు నమస్కారము (5).

ఓ మహర్షీ! నేను యోగనిద్రను ఇట్లు స్తుతించితిని| ఓ దేవర్షీ! అపుడు నా ఎదుట చండిక ప్రత్యక్షమయ్యెను (6).

చిక్కని కాటుక వలె ప్రకాశించునది, సుందరమగు రూపము గలది, ప్రకాశించు నాల్గు భుజములు గలది, సింహము నధిష్ఠించి యున్నది, చేతియందు వరముద్ర గలది, ముత్యములచే నొప్పు చూడా మణితో ప్రకాశించే కేశభారము గలది (7),

శరత్కాల చంద్రుని వంటి ముఖము గలది, చంద్రుని వలె స్వచ్ఛమైన ఫాలభాగము కలది, మూడు కన్నులు గలది, సర్వాంగసుందరి, పద్మముల వంటి పాదముల నఖముల కాంతిచే ఒప్పారునది (8), శివుని శక్తి అగు ఆ ఉమాదేవిని నా ఎదుట గాంచితిని. ఓ మహర్షీ! నేను భక్తితో శిరస్సును వంచి నమస్కరించి స్తుంతిచితిని (9).

ఓతల్లీ! జగత్తులోని ప్రవృత్తి నివృత్తులు నీ స్వరూపమే. జగత్తు యొక్క సృష్టిస్థితులు నీ స్వరూపమే. స్థావరజంగ మాత్మకమగు ప్రాణులలో నీవు శక్తి రూపముగ నుండి సర్వప్రాణులను మోహపెట్టుచున్నావు. నీవు సనాతనివి. నీకు అనేక నమస్కారములు (10).

కేశవుని వక్షస్థ్సలమునందు అలంకారముగా నుండు లక్ష్మీదేవి నీవే. సకలమును భరించి పోషించు నీవు విశ్వంభరవు. నీవు సృష్టిని చేసిన మహేశ్వరివి. ముల్లోకములను లయము చేయునది నీవే.నీవు గుణాతీతురాలవు (11).

యోగులు నిన్ను పూజించి తమ హృదయములలో దర్శించెదరు.అట్టి నిన్ను నమస్కరించుచున్నాను. పరమాణువులలోని సారము (శక్తి) నీవే. యమనియమాదులచే పవిత్రమైన యోగుల హృదయములలో నీవు ఉండి వారికి ధ్యాన మార్గములో దర్శనము నిచ్చెదవు (12).

ప్రకాశము, శుద్ధి ఇత్యాది గుణములచే విరాజిల్లు నీకు రాగ ద్వేషములు లేవు. వివిధ శాస్త్ర విజ్ఞానములకు సంబంధించిన విద్యలన్నియూ నీ స్వరూపమే. నీ స్వరూపము కూటస్థము (మార్పులకు లోను కానిది), మరియు ఇంద్రియములకు అగోచరము. నీవే అనంత రూపములతో ప్రకటమైనావు. నీవు కాల స్వరూపురాలై ముల్లోకములను ధరించి యున్నావు (13).

నీవు గుణములతో కూడి సర్వమానవులలో నిత్యము వారికి రాగద్వేషాది వికారములకు మూలమైన అవిద్యా రూపములో నున్నావనుట నిశ్చయము. హే శివప్రియే! మూడు గుణములకు ఆశ్రయము నీవే. మరియు నీవు గుణాతీతురాలవై యున్నావు (14).

సత్త్వము, రజస్సు, తమస్సు అనే ఈ గుణముల వికారములు నీయందు లేవు. కాని వాటి ఉనికి నీ యందు మాత్రమే గలదు. జగత్తునకు ఏకైక కారణమైన త్రిగుణాత్మక ప్రకృతి నీవే. నీవే ఈ బ్రహ్మాండమును సృష్టించి, రక్షించి, భక్షించుచున్నావు (15).

సర్వజగత్తుల బీజము నీవే. జ్ఞేయ జ్ఞానములు నీ స్వరూపమే. హే శివపత్ని! లోకముల క్షేమమును కోరి నేను సర్వదా నీకు నమస్కరించుచున్నాను (16).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఈ నా మాటను విని లోకరక్షకురాలగు ఆ కాళీదేవి సృష్టికర్తనగు నాతో ప్రీతితో, తల్లి పిల్లవానిని వలె లాలించి, ఇట్లు పలికెను (17).

దేవి ఇట్లు పలికెను -

హే బ్రహ్మన్‌! నీవు నా ఎదుట ధైర్యము గలవాడైనచో, నీవు నన్ను స్తుతించుటకు గల కారణమును వెంటనే నిశ్చయముగా చెప్పుము (18).

నేను ప్రత్యక్షమైన పిదప కార్యము సిద్ధించుట నిశ్చయము. కావున నీవు నీ కోర్కెను తెలుపుము. నీచే ఆరాధింపబడిన నేను నీ కోర్కెను తీర్చెదను (19).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము 

12 Oct 2020

No comments:

Post a Comment