✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము -04 🌻
“అపేక్ష అనేదాని వలననే మాలిన్యం ఏర్పడుతుంది”. ఎవరైతే ఈ ఫలాపేక్షను ఆంతరిక యజ్ఞంలో, పూర్ణాహుతిగా సమర్పిస్తాడో, ఈ ఆంతరిక యజ్ఞాన్ని నిరంతరాయంగా చేసి, జ్ఞానాగ్నిగా మార్చుకుంటాడో, ఆ జ్ఞానాగ్నిలో తనను తానే దహింపచేసుకుంటాడో, వ్యవహారిక జీవభావములను పూర్తిగా హవిస్సులుగా సమర్పించి, ఆత్మభావములో నిలకడ చెంది, ఆత్మనిష్ఠుడై తనను తానే పోగొట్టుకుంటున్నాడో, నామరూపాది లక్షణములను పోగొట్టుకుంటున్నాడో, అటువంటి వాడు ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుతున్నాడు, అది నిర్మలత్వం. త్రిగుణ మాలిన్యమనేది వాడికిక అంటేటువంటి అవకాశం లేదు. సర్వకాలము వాడు గుణాతీతుడుగా వుంటాడు. అట్లా ఉన్నప్పుడు ఏమైందట?
మనస్సు నిర్మలమైపోయింది. ఇంద్రియములు నిర్మలమైపోయాయి. బుద్ధి ప్రసన్నతను పొందింది. బాహ్యవిషయములనుండి బుద్ధికి ప్రవృత్తి నుండి నివృత్తికి మరలింది. ఇంకేమి తెలిసిందట?
బుద్ధికి ఒక శక్తి లభించింది.
‘బుద్ధిగ్రాహ్యమతీంద్రయం’ - అతీంద్రియ లక్షణాలతో ఉన్నటువంటి దివ్యత్వాన్ని, అతీంద్రియ లక్షణాలతో ఉన్నటువంటి ఆత్మానుభూతిని, అతీంద్రియ లక్షణాలతో ఉన్నటువంటి పరమాత్మ స్థితిని గ్రహించగలిగేటటువంటి శక్తి, బుద్ధికి లభించింది.
సమర్థవంతమైనటు వంటి బుద్ధి లభించింది. అట్టి మహిమను తెలుసుకో గలుగుతాడు. మహిమ అంటే మహత్తు స్థితియందు ఏదైతే ఉన్నదో, మహిమ అంటే ప్రకృతిలో ఆచరించబడేటటు వంటివి, నీ కనుల ముందు నీవు ఊహించ గలిగేటటు వంటివి, జరిగేటటువంటివి కావు.
బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది ప్రతీ ఒక్కరూ కూడా. అందరూ మహిమలు, మహిమలు అంటే, ఏమిటంటే ఏదైనా కొత్తవి సృష్టించడం కానీ, ఉన్నవి పోయేటట్లు చేయడం కానీ, లేదా నీకు తెలియనటువంటి వాటిని చెప్పడం గాని, ఇలాంటి ప్రకృతి ధర్మాలకు లోబడనటువంటి, జగద్ధర్మాలకు లోబడనటువంటి వాటిని ఏవైనా చేస్తే, వాటిని మహిమలు అని అందరూ ప్రస్తావిస్తూ ఉంటారు. కానీ, నిజానికి ఇవేవీ మహిమలు కావు. ఒకే ఒక మహిమ ఉన్నది - అది ఏమిటంటే, మహత్తు స్థితిని ప్రాప్తింప చేయటమే అది మహిమ.
“ఆత్మానుభూతి కలుగజేసేటటు వంటిది ఏదైతే ఉన్నదో, దాని పేరు మహిమ”- అటువంటి మహిమలు తెలుసుకున్నటు వంటి వాళ్ళు మాత్రమే, అటువంటి ఆత్మానుభూతిని పొందినటు వంటివాళ్ళు మాత్రమే, పరమాత్మస్థితిని తెలుసుకోవడానికి అధికారులు అవుతున్నారు. ఆత్మానుభూతే లేనటువంటివాడు, పరమాత్మ స్థితిని ఎట్లా తెలుసుకుంటాడు? కాబట్టి దీని వల్ల ఒక గొప్ప పరిణామం లభించిందట, శాశ్వత పరిణామం లభించింది.
ఏమిటయ్యా అంటే, శోకము నశించింది. దుఃఖం అవ్యాప్తి. వ్యాప్తి అంటే దుఃఖమే జీవితమంతా ఉంది. అంటే అర్థమేమిటంటే, ప్రసవ వేదనతో ప్రారంభమైనటువంటి జీవితం, మరణవేదనతో ముగించబడుతున్నది. జీవితకాలమంతా వేదనలే వున్నాయి. ఈ వేదనంతా శోకరూపంలో వున్నది.
శోక ప్రవాహమే జీవనము, వేరే ఇంకేమీ లేదు. మరి అటువంటి శోక ప్రవాహమేమైపోయిందట ఇప్పుడు? ఈ ఆంతరిక యజ్ఞ ప్రభావం చేత, ఈ నిష్కామ కర్మ ప్రభావం చేత, ఈ హృదయాకాశ స్థితి యందు చేయబడుతున్నటువంటి, ఆంతరిక యజ్ఞ ప్రభావం చేత, జ్ఞానాగ్ని ప్రభావం చేత, సర్వకర్మలను ఫలత్యాగ రహితంగా చేయడం వలన, ఫలత్యాగ పద్ధతిగా చేయడం ద్వారా, ఫలరహిత పద్ధతిగా చేయడం ద్వారా, సర్వకర్మలను హవిస్సులుగా ఆ ఆంతరిక యజ్ఞంలో అర్పించడం ద్వారా, సర్వస్యశరణాగతిని పొందడం ద్వారా, ఆత్మానుభూతిని ఆశ్రయించడం ద్వారా ఆ పరమాత్మస్థితిని తెలుసుకోగలిగేటటువంటి సమర్థత నీకు కలుగుతున్నది. తద్వారా ఒక గొప్పఫలం లభించింది. ఏమిటంటే శోక రహిత స్థితి.
వాడు ఎప్పటికీ దేని గురించీ శోకించడు. శోకము లేకపోవడమే కదా ఆనందం అంటే. ఆనందం అంటే అర్థం ఏమిటంటే శాశ్వతంగా శోకమునకు దూరమైపోయిన వాడు ఎవడైతే వున్నాడో వాడు ఆనంద స్థితుడు. ఆనంద స్థితుడు అంటే అర్థం అది.
వాడికి ఆనంద చాలామందికి మీరు పేర్లు వింటూ వుంటారు, తేజోమయానందా, తత్త్వమయానందా, నిజానంద ఈ రకంగా పేర్లు ఉంటాయన్నమాట! చిన్మయానంద, పరమార్దానంద ఈ రకంగా పేర్లుంటాయన్నమాట! ఇవన్నీ సన్యాస నామాలు. - విద్యా సాగర్ స్వామి
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ
Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
12 Oct 2020
No comments:
Post a Comment