కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 108


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 108 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మను తెలుసుకొను విధము -38 🌻

ఆగ్ర్యమ్య బుద్ధి అంటే అగ్రస్థితిలో వున్నటువంటి బుద్ధి. మనం ఇప్పటి వరకూ మాట్లాడుకున్న అంశాలను స్పష్టంగా ఇక్కడ చెబుతున్నారు. మీ ఇంట్లో ఒక వజ్రం ఉందనుకోండి. ఆ వజ్రాన్ని ఎక్కడ పెడుతారు సాధారణంగా? మీ వంటింట్లో ఉన్నటువంటి కప్పులు, సాసర్లు, బిందెలు, గిన్నెలు... అక్కడ వెతికారు అనుకోండి, ఆ వజ్రం కనబడుతోందా?

సాధారణంగా ఈ వజ్రమంత విలువైన దానిని ఎక్కడ పెడుతాము? ఎక్కడో ఒక చోట భద్రమైనటువంటి స్థితిలో పెడుతాము. భద్రమైనటువంటి స్థానంలో పెడుతాము. ఎందుకని? చాలా విలువైనది కాబట్టి. మరి వాటిని సామాన్యంగా మనం వెతికితే, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నేల మీద పడవేసి వెతికితే అది కనపడుతుందా అంటే, ఆ వస్తువులన్నిటిలో కలిసిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది.

అట్లాగే మనలో భద్రమైనటువంటి స్థానంలో, భద్రమైనటువంటి స్థితిలో స్వస్వరూప జ్ఞానమున్నది, స్వప్రకాశము కూడా ఉన్నది. అదే ఆత్మ. అర్థం అయ్యిందా అండి. బుద్ధి గుహయందు ఉన్నటువంటి హృదయాకాశ స్థానములో, నిరంతరాయంగా వెలుగుతూ ఉన్నటువంటి, స్వప్రకాశము ఏదైతే ఉన్నదో అది ఆత్మ. ఇది భద్రంగా ఉంది. అతి సూక్ష్మంగా ఉంది, గుహ్యంగా ఉంది, రహస్యంగా ఉంది, భద్రమైన స్థితిలో వుంది, భద్రమైన స్థానంలో ఉంది.

ఒక్కొక్కదానిని విరమించుకుంటూ, ఒక్కొక్క దానియందున్న సంగత్వాన్ని పోగొట్టుకుంటూ, ఆసక్తులను పోగొట్టుకొంటూ, ప్రవృత్తి మార్గం నుండి నివృత్తి మార్గంలోకి మరలడం ద్వారా, మనస్సును మరలించడం ద్వారా, నీ మనస్సు సదా గిన్నెల చుట్టూ, సదా విషయముల చుట్టూ, సదా తినే పదార్థముల చుట్టూ, సదా భోగించేటటువంటి లక్షణాల చుట్టూ, మనస్సు పనిచేస్తూ ఉన్నప్పుడు, ఏ బట్టలు కట్టుకుందాం? ఏ భోజనం చేద్దాం? ఏ రకంగా సుఖాన్ని పొందుదాం? ఏ రకంగా విశ్రాంతి తీసుకుందాం? ఏ రకంగా అలంకారం చేద్దాం? ఈ రకంగా బాహ్యమైనటువంటి విషయాల చుట్టూ, బాహ్యమైనటువంటి వస్తువుల చుట్టూ, మనస్సు పనిచేస్తూ ఉంటే, బుద్ధి కూడా మనసును అనుసరించి, నిర్ణయాలు చేస్తూ ఉంటుంది బాహ్యముగానే.

ఏ నివృత్తి మార్గానికి, స్వస్వరూప ఆత్మజ్ఞానానికి, ఉపయోగపడవలసినటువంటి బుద్ధి ఉన్నదో, దానిని బాహ్యమైనటువంటి విషయాల కొరకు, బాహ్యమైనటుంవంటి వస్తు జ్ఞానము కొరకు, వ్యవహార నిర్ణయము కొరకు, వాడుకోవడం ఎటువంటి దంటే, కంట్లో ఆపరేషన్‌ చేయడానికి ఉపయోగించ వలసినటువంటి కత్తిని, కూరగాయలు కోయడానికి ఉపయోగించ రాదా? అంటే, అది కూడా కత్తే, కోయడానికి ఉపయోగ పడుతుందా? పడదా? పడుతుంది. కానీ, ఒకసారి కూరగాయలు కోస్తే మరల కంట్లో ఆపరేషన్స్‌ చేయడానికి ఉపయోగపడదు. ఇప్పుడు మన బుద్ధి ఇలాగే తయారైంది.

బుద్ధి నివృత్తి మార్గం ద్వారా స్వస్వరూప ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందటానికి ఉపయోగపడవలసిన సూక్ష్మమైనటువంటి ఇంద్రియం. అది ఎంత సూక్ష్మమైనది అంటే, సూర్యకిరణాలను కూడా నిలువుగా ఛేదించగలిగేటటువంటి సమర్థత కలిగినంత సూక్ష్మమైనటువంటి ఇంద్రియం. దానిని ఇప్పుడు మనము బిందెల చుట్టు, కడవల చుట్టు, భౌతికమైన, స్థూలమైనటువంటి విషయాల చుట్టూ, వస్తువుల చుట్టూ తిప్పుతున్నాము.

ఈ రకమైనటువంటి అభ్యాసదోషం చేత మన బుద్ధి స్థూలతని సంతరించుకుంది. తన సూక్ష్మతను పోగొట్టుకుంది. ఇప్పుడు పునః ఏం చేయాలట? దానిని వెనక్కు తిప్పుకుని, మనస్సును విరమింప చేసి, బుద్ధిని విరమింప చేసి, దానికి మూలమైనటువంటి, కారణమైనటువంటి, మహతత్వమునందు, అవ్యక్తము నందు దానిని స్థిరపరచి బుద్ధిగుహ యందు విచారణ చేసి, దృష్టి నిలిపి, హృదయాకాశము నందు సదా ప్రకాశిస్తున్నటువంటి, ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని మానవులు పొందాలి.

అలా ఎవరైతే పొందుతారో వాళ్ళకి, ఆ సాక్షాత్కార జ్ఞానం, ఆ జన్మపర్యంతం అంటే, జనన మరణాలను దాటటానికి అదే సోపానముగా పనికి వస్తుంది. అదే అవకాశంగా పనికి వస్తుంది. ఈ జనన మరణ చక్రంలోనుంచి బయటపడగలుగుతాడు. కర్మబంధాలలోనుంచి బయటపడగలుగుతాడు. మోహంలోనుంచి బయటపడగలుగుతాడు.

ఆ ఆత్మసాక్షాత్కార జ్ఞానానికి ఎంతో విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. మానవజన్మని ధన్యత చెందించగల సర్వసమర్థమైనటువంటి సాధన ఏదైనా ఒకటి ఉంది అంటే, అది ఆత్మవిచారణ, ఆత్మసాక్షాత్కార జ్ఞానము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


20 Nov 2020

No comments:

Post a Comment