✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀 18. అమలిన కర్మ - చిత్తమునకు ఏడు గుణములబ్బును. అవి ఈ విధముగ నున్నవి. 1. కోరికలేమి, 2. నిస్సంకల్పము, 3. కర్మఫల సంగత్యాగము, 4. నిత్యతృప్తి, 5. నిరాశ్రయత, 6. నిరాశ, 7. అపరిగ్రహము. ఈ ఏడు గుణము లబ్బినచో నిగ్రహింపబడిన చిత్తము గలవాడై యుండును. అట్టివాడు నిర్వర్తించు కర్మల నుండి బంధనము పుట్టదు. 🍀
📚. 4. జ్ఞానయోగము - 21 📚
నిరాశీ ర్యతచిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహః |
శారీరం కేవలం కర్మ కుర్వ న్నాప్నోతి కిల్బిషమ్ || 21
ఆశ లేనివాడును, చిత్త నిర్వహణము కలవాడును, ఏ వస్తువును పరిగ్రహింపనివాడును చేయు కర్మనుండి ఎట్టి పాపము (మలినము) పుట్టదు అని యర్థము. 19వ శ్లోకమున సంకల్పము, కోరిక లేకుండుటను గూర్చి దైవము తెలిపినాడు. 20వ శ్లోకమున నిత్యతృప్తి, నిరాశ్రయత, కర్మఫలసంగ త్యాగము తెలిపినాడు. ఈ శ్లోకమున ఆశ లేకుండుట, అపరిగ్రహము, చిత్త నిగ్రహము తెలిపినాడు.
ఆశ లేనివానికి చిత్తము పలువిధముల పరుగులెత్తదు. ఆశ, కోరిక లేక తృప్తిగ జీవించువానికి, చిత్తము స్థిరపడి సంకల్పములు లేని స్థితి కూడ కలుగును. దీనికి అపరిగ్రహము తోడైనచో చిత్తము లోతుగ స్థిరపడును. ఈ శ్లోకము చేరుసరికి చిత్తమునకు ఏడు గుణములబ్బును. అవి ఈ విధముగ నున్నవి.
1. కోరికలేమి, 2. నిస్సంకల్పము, 3. కర్మఫల సంగత్యాగము, 4. నిత్యతృప్తి, 5. నిరాశ్రయత, 6. నిరాశ, 7. అపరిగ్రహము.
ఈ ఏడు గుణము లబ్బినచో నిగ్రహింపబడిన చిత్తము గలవాడై యుండును. అట్టివాడు నిర్వర్తించు కర్మల నుండి బంధనము పుట్టదు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
20 Nov 2020
No comments:
Post a Comment