శ్రీ శివ మహా పురాణము - 277


🌹 . శ్రీ శివ మహా పురాణము - 277 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

65. అధ్యాయము - 20

🌻. సతి కైలాసమునకు పయనమగుట - 4 🌻



అపుడు శివుడు మార్గమధ్యమునుండి ప్రీతితో దక్షుని వెనుకకు పంపెను. ప్రేమతో నిండిన హృదయము గల శంభుడు గణములతో గూడి తన ధామను చేరుకొనెను (51). శివుడు విష్ణువు మొదలగు దేవతలకు వెనుకకు మరలుడని అనుజ్ఞ ఇచ్చెను. కాని వారు పరమానందముతో, భక్తితో శివుని వెనుక వెళ్లిరి (52).

శివుడు వారందరితో, తన గణములతో, మరియు తన భార్యతో గూడి హిమవత్పర్వతమునందు ప్రకాశించేతన ధామమును ఆనందముతో చేరుకొనెను (53). అచటకు చేరిన పిదప, దేవతలను, మునులను, ఇతరులను అందరిని ఆదరముతో మిక్కిలి సన్మానము చేసి ఆనందముతో సాగనంపెను (54).

ఆ విష్ణువు మొదలగు దేవతలు, మునులు అందరు శివునితో మాట్లాడి, నమస్కరించి, స్తుతించి, ఆనందముతో నిండిన ముఖములు గల వారై తమ తమ స్థానములకు వెళ్లిరి (55). శివుడు కూడ లోకరీతిని అనుసరించు వాడై తన భార్యయగు దాక్షాయణితో గూడి మిక్కిలి ఆనందించిన వాడై హి మవత్పర్వత మైదానములలో విహరించెను (56).

జగత్కారణమగు ఆ శంకరుడు సతీ దేవితో గూడి ఆనందముగా నుండెను. ఓ మహర్షీ! కొంతకాలము తరువాత ఆయన పర్వత రాజమగు కైలాసమును చేరుకొనెను (57). స్వాయంభువ మన్వంతరములో పూర్వము వృషభవాహనుని వివాహము జరిగినది. ఆ వృత్తాంతమునంతనూ నేను మీకు చెప్పితిని (58).

వివాహసమయము నందుగాని, యజ్ఞ ప్రారంభమునందుగాని ఎవరైతే వృషభధ్వజుని చక్కగా పూజించి స్థిరచిత్తులై ఈ గాథను వినెదరో (59), వారికి ఆ వివాహాది శుభకర్మలన్నియూ సర్వదా నిర్విఘ్నముగా కొనసాగును (60).

ఈ శుభగాథను ఆనందముతో వినే కన్య సుఖసౌభాగ్యములతో, శీలాచారములతో, సద్గుణములతో కూడినదై పతివ్రతయై పుత్ర సంతానమును పొందును (61).

శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహిత యందు సతీఖండలో సతీ వివాహ వర్ణనమనే ఇరువది యవ అధ్యాయము ముగిసినది (20).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



20 Nov 2020

No comments:

Post a Comment