భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 165


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 165 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. జాబాలిమహర్షి - 5
🌻

25. నేటి గుజరాత్‌లో, గోపాలకుడైన సాక్షాత్తూ శ్రీకృష్ణుని నగరమైన ద్వారాపట్టణంలోనే గోవుల పరిస్థితి పరమదారుణంగా ఉంది! ద్వారకా పట్టణం, కృష్ణపూజ, గోపూజ, కృష్ణాష్టమి అని ఏవేవో పండుగలు చేసుకుంటాం, మనం వండుకుని తినడానికి! పిండివంటలు వండుకోవటానికే మనం ఈ పండుగలు చేసుంకుంటున్నామా అనిపిస్తుంది.

26. కనీసం కృష్ణాష్టమి నాడైనా మనం గోవులను స్మరిస్తున్నామా? ధర్మాన్ని ఆచరిస్తున్నామా? ఎంత భ్రష్టత్వం వచ్చిందంటే, ఇంతకన్నా దుఃఖం ఏమీలేదు.

27. ఎంతో అజ్ఞానం, ఎంతో నిస్పృహ, జడత్వం, మొండితనం ఉంటే తప్ప అవి చూడలేము. చూచి తట్టుకోలేము. జీవనోపాధికోసమేనా ఇటువంటి భయంకరమైన పాపాలుచేయటం! కోటానుకోట్ల జీవరాశులను కేవలం చంపటానికై పుట్టిస్తున్నారు. చేపలనో, కోళ్ళనో, పశువులనో – చంపటంకోసమే నేడు పుట్టిస్తున్నారు.

28. సహజంగా జీవకోటి ఎంత ఉందో, ఆ ఉన్నవాటిలో, తమకు అవసరమైనంత వరకు, దొరికినంత మటుకు చంపటం కాదు. వాటిని వ్యాపారం కోసం పుట్టించి చంపటమే ఘోరమయిన విషయం! అయితే ఎందుకు ఇదంతా చెయడం, దేనికోసం అంటే ధనం కోసమే! అమితమైన భోజనం ఉన్నవాళ్ళే వీళ్ళందరూ. వీళ్ళకు అన్నవస్త్రాదులకు లోటులేదు. దారిద్య్రం లేదు. జీవనం సుఖంగా ఉంది. సిరిసంపదలు ఉన్నవి. కాని ధనదాహం!

29. లోపల భారతీయుడి మనస్సులో కాస్తయినా ఆర్యధర్మం మిగిలి ఉంటే, ఈ ఘోరమయిన పాపమ్యొక్క ఫలం ఎలా ఉంటుందో గ్రహించగలడు. కానీ లోపల ఉండవల్సిన ఆ ధార్మికబుద్ధి, ఆ జ్ఞానమూ ఎందుకు పోయింది? ఈ ధనాశ – ధనపిశాచం ఎప్పుడయితే వచ్చిందో, ధర్మం హరించుకుపోయింది.

30. పిశాచాలు ఉన్నచోట దేవతలు ఉంటారా? ఆ ధనపిశాచం లోపలికిరాగానే హృదయంలో ఉన్న దివ్యత్వం, ఆర్యసంస్కృతి, ఋషులు అంతా ఎక్కడికో పోతారు. కాబట్టే ఈ దౌర్భల్యం ఏర్పడింది. ఈనాడు మన దేశ పరిస్థితులు ఇలా ఉండటానికి కారణం అదే!

31. పాపం పెరిగిపోయిన తరువాత నిదర్శనం ఏముంటుంది? కొంచెం పుణ్యం, కొంచెం పాపంతో ఉండేవాడు; కొంచెం పాపం చేసినట్లయితే, “ఈ పాపం చేస్తున్నావు జాగ్రత్త!” అని స్వప్నంలో ఎవరో కనబడి చెప్పటం జరుగుతుంది. పూర్తిగా పాపంలో ఉండేవాడికి ఎవరూ కనబడరు.

32. కాబట్టి పుణ్యపాపమిశ్రమ జీవనంలో, పుణ్యంమీద శ్రద్ధ ఉండేవాడికి పాపక్షయం అయ్యే అవకాశం ఉంది. ఈ కారణంచేత నేడు మన దేశంలో ఏ క్షణాన ఏమవుతుందో ఎవరిఖీ తెలియని స్థితి వచ్చింది.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


20 Nov 2020

No comments:

Post a Comment